అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం జగన్ అనేక పథకాలు ప్రజలకు అందించిన విషయం తెలిసిందే. కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా కూడా ఇటీవల కొన్ని కీలక పథకాలు అందించారు. అలాగే జులై 8న అర్హులైన ప్రతి పేద ప్రజలకు ఉచిత ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ పథకం గత మార్చిలోనే జరగాల్సింది. కానీ కరోనా నేపథ్యంలో భూ పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

 

ఇక లాక్ డౌన్ సడలింపులు వస్తున్న నేపథ్యంలో జులైలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే భూపంపిణీ వెనుక పెద్ద మాఫియా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ప్రభుత్వ సొమ్ముతో ఎక్కువ ధరకు  పనికిరాని భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం అంటూ, మద్యం షాపులని ప్రభుత్వమే నడిపేలా నిర్ణయం తీసుకుంది.

 

అయితే అప్పుడు మద్యం షాపులని ప్రభుత్వం అద్దెకు తీసుకుని, షాపులని ఏర్పాటు చేసింది. ఇక ఆ షాపులు విషయంలో కూడా వైసీపీ నేతలు కలగజేసుకుని, 10 వేలు అద్దె కూడా ఉండని షాపులకు 50 వేలపైనే ప్రభుత్వం నుంచి అద్దె తీసుకునేలా చేస్తున్నారని టీడీపీ నేతలు అప్పటిలోనే ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా పల్లెటూర్లలో తక్కువ రెంట్లు ఉండే షాపులకు  ఎక్కువ మొత్తంలో రెంట్ దక్కేలా చేసుకున్నారని,అదేవిధంగానే ఇప్పడు కూడా లక్ష రూపాయలు కూడా ఉండని భూములకు కోట్లు పెడుతున్నారని అంటున్నారు.

 

ఇదే విషయంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ...ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లకు పైబడి వైస్సార్సీపీ నాయకులూ దండుతున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కొనుగోలు పేరు చెప్పి ప్రజల సొమ్మును  వైస్సార్సీపీ నాయకులకు ఎట్లా కట్ట బెడతారని, ఇళ్ల స్థలాల కోనుగోలు పేరుతో లక్షలు విలువ చేసే భూములను కోట్లు విలువ చేసే భూములుగా చూపి దోచుకొంటున్నారని నిమ్మల ఆరోపణలు చేసారు. మరి ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందో?

మరింత సమాచారం తెలుసుకోండి: