తెలంగాణ లో కరోనా వైరస్   పూర్తి కట్టడిలోనే ఉన్నదన్న  రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , రాష్ర్టం లో కరోనా  పరీక్షలు  నిర్వహించడం లేదన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు . రాష్ర్టం లో కరోనా పరీక్షలే నిర్వహించడం లేదని గత కొన్ని రోజులుగా  విపక్షాలు  ఆరోపిస్తున్నాయి . ప్రభుత్వం కరోనా వైరస్ సోకిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నాయి .  రాష్ర్టం లో  కరోనా పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర  అద్యక్షుడు బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు .

 

గాంధీ ఆసుపత్రి లో  ఒక వృద్ధుడు కరోనా  పరీక్షలు చేయించుకోగా ...ఫలితాల్లో నెగిటివ్ అని తేలిందని , అదే వృద్దుడు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని సంజయ్ కేంద్ర  హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు . సదరు వృద్దుడు చికిత్స పొందుతూ కరోనా వ్యాధి కారణంగా మృతి చెందాడని ... అయినా రాష్ట్ర ప్రభుత్వం కరోనా మృతుల జాబితా లో ఆ వృద్ధుడి పేరు చేర్చలేదని అన్నారు . కరోనా  పరీక్షలు సరిగ్గా చేయడం  లేదని , మృతుల జాబితాను కూడా తగ్గించి చూపుతున్నారనడానికి  ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని బండి సంజయ్ తన లేఖతో  వెల్లడించారు  .

 

అయితే విపక్షాలు చేస్తోన్న ఈ తరహా  ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఈటల , డయాలసిస్ రోగి అయిన 75 ఏళ్ల  వృద్దుడు కూడా  కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లాడని తెలిపారు .ఇదంతా మన వైద్యుల కృషి అంటూ కితాబునిచ్చారు . తెలంగాణ లో  కరోనా మరణాల రేటు తక్కువగా ఉండడానికి , కేసుల సంఖ్య  తగ్గడానికి నిరంతర ప్రభుత్వ పర్యవేక్షణే కారణమని ఈటల అన్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: