దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా ప్రజారవాణా స్తంభించిపోయింది. లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అయితే తాజాగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈనెల 17 నుంచి కేంద్రం ప్రజారవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలకు కేంద్రం షరతులతో కూడిన సడలింపులు ఇవ్వనుందని సమాచారం. 
 
కరోనా ప్రభావం వల్ల ఇకపై కొంతకాలం ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రయాణికులు ఆన్లైన్ లేదా రిజర్వేషన్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఇటీవలే సూచనప్రాయంగా ఈనెల 17 నుంచి ప్రజా రవాణాకు అవకాశం ఇస్తామని పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికులకు బస్టాండ్ లలో కరెంట్ బుకింగ్ అవకాశం కల్పించనున్నాయని తెలుస్తోంది. ఏపీ బస్ సర్వీసుల్లో 100 శాతం నగదు రహిత లావాదేవీలే ఉండబోతున్నాయి. 
 
ఏపీ ఆర్టీసీ ఇప్పటికే ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఆర్టీసీ నాన్ స్టాప్ సర్వీసుల్లో కూడా ఆన్లైన్ రిజర్వేషన్ అందుబాటులోకి తీసుకురానుంది. పల్లె వెలుగు బస్సు లో ప్రయాణించే వారు మాత్రం బుకింగ్ ఏజెంట్ల దగ్గర టికెట్ కొనాల్సి ఉంటుంది. బస్టాప్ లలో టిమ్ యంత్రాల ద్వారా టికెట్లు విక్రయించనున్నారు. ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్ వారానికే పరిమితం చేయనుంది. 
 
సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు లేకుండా ప్రయాణికులు టికెట్ కొని ప్రయాణం చేసేలా ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 15న ప్రజా రవాణా గురించి కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరోసారి పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించినా ప్రవా రవాణాకు షరతులతో సడలింపులు ఇవ్వనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: