ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,388 మందికి పరీక్షకు నిర్వహించగా 43 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో ఈరోజు మరో ముగ్గురు చికిత్సకు కోలుకోలేక మృతి చెందినట్టు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 887 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 999 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటం గమనార్హం. ఈరోజు కృష్ణా జిల్లాలో ఇద్దరు మృతి చెందగా కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 44కు చేరింది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
ప్రభుత్వం మృతుల సంఖ్య పెరగకుండా దృష్టి పెట్టాల్సి ఉంది. తెలంగాణలో మృతుల సంఖ్యతో పోలిస్తే ఏపీలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంతో కొంతమేర సఫలమవుతున్నా మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో కర్నూలు జిల్లాలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 
 
మరోవైపు గత కొన్నిరోజులుగా తక్కువ కేసులు నమోదైన కృష్ణా జిల్లాలో మరోసారి వైరస్ విజృంభించింది. కృష్ణా జిల్లాలో ఈరోజు 16 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 11 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో 6, విశాఖలో 5 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 553 కేసులు నమోదు కాగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయి.             

మరింత సమాచారం తెలుసుకోండి: