అగ్ర‌రాజ్యం అమెరికాకు అదిరిపోయే షాక్ లాంటి వార్త ఇది. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆ దేశ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవలే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకునికి కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగించింది. అయితే, ఇదే స‌మ‌యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిల్లర్ కు వైరస్ పాజిటివ్ రావ‌డం క‌ల‌వ‌ర‌పాటు క‌లిగించింది. తాజాగా మ‌రో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది.  ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్​కు కరోనా పాజిటివ్ వచ్చిందని వైట్​హౌస్ వర్గాలు వెల్ల‌డించాయి. 

 

ఇవాంకాకు ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ వైరస్ బారిన పడిన వార్త‌లు అమెరికాలో క‌ల‌వ‌రం సృష్టించాయి. ఇవాంకాకు సైతం క‌రోనా సోకుతుందా అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంతో, రోజూవారీ పరీక్షల్లో భాగంగా ఇవాంకా.. ఆమె భర్త కుష్నర్ కు శుక్రవారం టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మ‌రోవైపు, ఇవాంకా అసిస్టెంట్ కొద్దిరోజులుగా ఇవాంకాకు దూరంగా ఉన్నారని, కాబట్టి ఇవాంకాకు ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొన్నాయి. 

 


కాగా, అద్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ రోజువారీగా వైట్ హౌస్ లో సమావేశం అవుతూనే ఉంటారు. పెన్స్ పత్రికా కార్యదర్శి కేటీ మిల్లర్‌కు తాజాగా పాజిటివ్ రావడం అధికారులను షాక్‌కు గురిచేసింది. కేటీకి పాజిటివ్ రావడం గురించి శుక్రవారం రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుల సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. 'చాలాకాలం నుంచి పరీక్షలు జరుపుతున్నా కేటీకి ఏమీ బయటపడలేదు. ఇప్పుడు హటాత్తుగా పాజిటివ్ వచ్చింది' అని ఆయన వివరించారు. 'పెన్స్‌ను కేటీ అధికారికమైన పనుల మీద తరచూ కలుసుకుంటుంది. అందుకే ఆయనకు పరీక్షలు జరిపిస్తే నెగెటివ్ వచ్చింది' అని ట్రంప్ తెలిపారు. ట్రంప్‌కు, పెన్స్‌కు తగిన భద్రత కల్పిస్తున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కేలీ మెక్ఎనానీ చెప్పారు. కేటీ భర్త స్టీఫెన్ మిల్లర్ అధ్యక్షునికి వలస వ్యవహారాల సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈ వలయంలోనే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నారు. కాగా, వైట్​హౌస్​లో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: