విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘ‌ట‌న నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ‌ల‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుతున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌ను అత్య‌వ‌స‌ర కేసుగా భావించిన హైకోర్టు స‌మోటోగా స్వీక‌రించి, విచార‌ణ చేప‌ట్టింది. జ‌నావాసాల మ‌ధ్య అస‌లు ప‌రిశ్ర‌మ ఎలా ఉందంటూ ప్ర‌శ్న‌లు వేసింది. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణాల‌ను వివ‌రిస్తూ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేస్తూ వారంరోజుల‌పాటు విచార‌ణ‌ను వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఒక వాద‌న‌ను ముందుకు తీసుకొస్తున్నారు. అస‌లు జ‌నావాసాల మ‌ధ్య ప‌రిశ్ర‌మ‌ల‌కు ఎలా అనుమ‌తి ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. జ‌నావాసాలు ఉన్న ప్రాంతాల్లో ప‌రిశ్ర‌మ‌లు ఉండ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వాద‌న‌పై కొంద‌రు విశ్లేష‌కులు త‌మ అభిప్రాయాన్ని చెబుతున్నారు. నిజానికి.. ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ప్పుడు దూర ప్రాంతాల్లోనే ఇస్తున్నార‌ని, క్ర‌మంగా అక్క‌డ ప్ర‌జ‌లు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నార‌ని, కొన్నేళ్ల త‌ర్వాత ఆ ప‌రిశ్ర‌మ‌ల చుట్టూ జ‌నావాసాలు ఏర్ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు. విశాఖ‌లోనూ ఇదే జ‌రిగింద‌ని అంటున్నారు.

 

విశాఖ‌లో హిందుస్తాన్‌ పాలిమర్స్‌ పేరుతో 1961లో ఈ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీనీ ప్రారంభిచేట‌ప్పుడు అది నిర్జ‌న ప్రాంతం. చుట్టుప‌క్క‌ల ఒక్క ఇల్లు కూడా లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆ త‌ర్వాత‌ 1978లో దీనిని యూబీ గ్రూప్‌ తీసుకుంది. 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ గ్రూప్‌(ఎల్‌జీ కెమికల్స్‌) తీసుకుని ఎల్‌జీ పాలిమర్స్‌గా మార్చింది. థర్మాకోల్‌ లాంటివి ఇందులో తయారు చేస్తారు. లాక్‌డౌన్‌ మినహాయింపుల్లో పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో దీనిని తిరిగి ప్రారంభించారు. ప్రారంభించిన ఒక్క రోజులోనే ఈ గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగింది. నిజానికి.. జ‌నావాసాలు లేని స‌మ‌యంలోనే ఈ కంపెనీకి అనుమ‌తి ఇచ్చార‌ని, జ‌నాలే ఆ కంపెనీ చుట్టుప‌క్క‌ల క్ర‌మంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవ‌డం ప్రారంభించార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు జ‌నావాసాల మ‌ధ్య ప‌రిశ్ర‌మ‌కు అనుమ‌తి ఎలా ఇచ్చార‌న్న ప్ర‌శ్న‌కు అవ‌కాశ‌లేద‌ని చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: