సృష్టిలో అమ్మకు మించిన దైవం లేదంటారు. దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు అని మరికొందరు అంటున్నారు. నిజానికి అమ్మ దేవుడు కంటే గొప్పది. మనల్ని నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేస్తుంది. మనం పెద్దవారిమి అయిన తర్వాత కూడా అమ్మ మన కోసం ప్రేమను పంచుతూనే ఉంటుంది. తన ఊపిరి ఉన్నంతవరకు మనకి నిస్వార్ధమైన ప్రేమని పంచుతూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. మనం ప్రతి సంవత్సరం ప్రపంచ మాతృ దినోత్సవాన్ని మే నెలలో రెండవ ఆదివారం నాడు జరుపుకుంటాం. ఈ సంవత్సరం 10వ తేదీన మే రెండవ వారం ఆదివారం కాగా... రేపు మనమందరం మాతృ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం.


మాతృ దినోత్సవం అనేది అమ్మ పని చేసే శ్రమని గుర్తించడానికి... వారిని అభినందించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రోజు. అమ్మలేనిదే ఇల్లు చక్కబడదు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వారిని పెద్దవారిని చేసి... వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేంత వరకు అమ్మ సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి గొప్ప అమ్మకు కచ్చితంగా మనం అభినందనలు తెలపాలి... కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు తరచూ అమ్మ చేసే విలువైన శ్రమను ప్రతి సందర్భంలో అభినందిస్తూనే ఉండాలి. కానీ చాలామంది తమ పనులలో తాము మునిగిపోయి అమ్మ పనిని గుర్తించరు. అలాంటి వారి కోసమే ప్రపంచ మాతృ దినోత్సవం పుట్టింది. మాతృ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం ప్రజలు జరుపుకుంటారు.


1872 లో జూలియవర్డ్ హోవే అనే అమెరికన్ మహిళ ప్రపంచం శాంతంగా ఉండాలంటే మనల్ని కన్న మాతృమూర్తిని ఒక్కరోజైనా తరించుకోవాలని... అందుకోసం మాతృ దినోత్సవం నిర్వహించాలని ఆమె ప్రతిపాదించింది. ఆ సమయంలోనే మదర్స్ డే జరుపుకోవాలనే ఆలోచనకు బీజం పడింది. ఆమె తర్వాత అమెరికాకు చెందిన అన్నా మేరీ జార్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ మాతృ దినోత్సవం ఏర్పడక ముందే ఆమె 1905 మే 9న చనిపోయింది. దాంతో తన తల్లి కోరిక నెరవేర్చాలని మిస్ జార్విస్ మాతృ దినోత్సవం కోసం ఎంతో కృషిచేసింది. సరిగ్గా 3 సంవత్సరాల తరువాత అనగా 1908లో తన అమ్మ స్మారక కార్యక్రమాన్ని పశ్చిమ వర్జీనియాలోని ఓ చర్చి లో ఏర్పాటు చేసి అక్కడి విచ్చేసిన ప్రతిఒక్కరికి అమ్మ యొక్క గొప్ప తనాన్ని తెలుపుతూ ఆ రోజే తన అమ్మకు మాతృ దినోత్సవం జరిపింది మిస్ జార్విస్. తదనంతరం మాతృ దినోత్సవాన్ని క్యాలెండరు లో చేర్చి అందరూ జరుపుకోవడం ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: