కరోనా తర్వాత ఏపీని కుదిపేసిన భారీ ఘటన ఏదైనా ఉందంటే అది..విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి విడుదలైన విష వాయువు చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో వందలాది ప్రజలకు నరకం చూపించింది. ఆ విష వాయువు వల్ల 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్..చనిపోయిన వారికి కోటి సాయం, వెంటిలేటర్ పై ఉన్నవారికి 10 లక్షలు, ఇంకా పలు విధాలుగా అక్కడి ప్రజలకు సాయం అందించారు.

 

అయితే ఈ సాయంపై తెలుగు తమ్ముళ్లు విమర్శలు చేస్తున్నారు. కోటి ఇస్తే మనిషి ప్రాణాలు తిరిగొస్తాయని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ కోటి సాయంపై కొన్ని విషయాలు కూడా చెబుతున్నారు. జగన్ చెప్పిన ప్రకారం సాయం చేయాలంటే దాదాపు 80 కోట్లపైనే అవుతుందని, కానీ వారు విడుదల చేసింది 30 కోట్లేనని అంటున్నారు. పైగా కంపెనీకి ఇన్సూరెన్స్ 200 కోట్లు వరకు వస్తుందని, అదంతా వైసీపీ నేతలే పంచుకుంటారని చెబుతున్నారు.

 

అందుకే కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అంటున్నారు. ఇక ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఇలా సాయంపై నానా రకాలుగా ఊహాగానాలు చేస్తున్న తరుణంలోనే బాధిత గ్రామం ఆర్ఆర్ వెంకటాపురంలో వాసులు ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఎల్జీ కంపెనీ ఎదుట ధర్నాకు దిగి కంపెనీని ఇక్కడి నుంచి ఇంకో చోటుకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

అయితే కొందరు కావాలనే బాధితుల్ని రెచ్చగొట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వారికి ఊహించని విధంగా సాయం చేశామని, ఇంకా జరిగిన ఘటనపై హై పవర్ కమిటీ వేశామని, వారు అన్ని విషయాలు పరిశీలించి రిపోర్ట్ తయారు చేస్తారని, ఇక దాని బట్టి కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని, కాబట్టి బాధితులు ఓర్పుతో ఉండాలని కోరుతున్నారు. మరి చూడాలి ఈ మాటలతో బాధితులు ఎంతవరకు కంట్రోల్ అవుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: