ఏపీలో మందుబాబులకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఓ పక్క మద్యం షాపులు తగ్గిపోతుంటే, మరోపక్క పెరిగిన రేట్లు గూబగుయ్యిమనిపిస్తున్నాయి. ఇది మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకు ఆదాయంలో తగ్గుదల కనిపిస్తోంది.

 

నిన్నటిదాకా లాక్ డౌన్ లో మద్యం దొరకలేదని బాధ పడ్డారు. ఇప్పుడు లిక్కర్ షాపులు తెరిచినా కొనలేని పరిస్థితిలో పడ్డారు. అనూహ్యంగా పెరిగిన రేట్లు మందుబాబులకు షాక్ ఇస్తున్నాయి. దీని ప్రభావం మద్యం అమ్మకాలపై స్పష్టంగా పడింది. మద్యం షాపులు తెరిచిన మొదటి రోజు భారీగా కొనుగోళ్లు జరిగితే... ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

 

42 రోజుల లాక్ డౌన్ సమయంలో దేశమంతా మద్యం షాపులను పూర్తిగా బంద్ చేశారు. దీంతో అల్లాడిపోయిన మందు బాబులు మద్యానికి దూరమయ్యారు. అక్కడక్కడా బ్లాకులో రెట్టింపు ధరలకు కూడా కొన్నా, మెజారిటీ ప్రజలకు మద్యం అందుబాటులో లేదు. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవటానికి అనుమతులు ఇచ్చింది. కానీ, ధరలను 25శాతం పెంచి మందుబాబుల ఆనందాన్ని ఆవిరి చేసింది. అయినా, పెరిగిన రేట్లను పట్టించుకోకుండా తొలి రోజున వైన్ షాపుల దగ్గర క్యూ కట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.91 కోట్ల మేరకు అమ్మకాలు జరిగాయి.

 

తొలిరోజున ధరలు పెంచినా మద్యం అమ్మకాలు మాత్రం బాగానే జరిగాయి. అయితే లాక్ డౌన్ నిబంధనలను పక్కన పెట్టి, సామాజిక దూరాన్నిగాలికొదిలి మద్యం మద్యం ప్రియులు వైన్ షాపుల దగ్గర చేసిన ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి. తొలి రోజున పాఠాలతో ప్రభుత్వం రెండో రోజున నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రెండో రోజున మరో 50 శాతం అదనంగా పెంచింది. దీనితో ఒక్కసారిగా ఏపీలో మద్యం ధరలు ఒక్కసారిగా 75 శాతం పెరిగి షాక్ ఇచ్చాయి. దీంతో రెండో రోజు నుంచి మద్యం అమ్మకాలు పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి.

 

మద్యం షాపులు తెరుచుకున్న తొలిరోజున రూ.91 కోట్ల అమ్మకాలు జరగ్గా, రెండో రోజు రూ. 48 కోట్లు, మూడో రోజు రూ57కోట్లు, 4వ రోజు 43 కోట్లు, 5వ రోజు రూ.42 కోట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. మద్యం అమ్మకాలు తగ్గటానికి ప్రధాన కారణంగా ధరలు పెరగటమే అని అబ్కారీ శాఖ చెబుతోంది. 

 

ఇప్పటికే మద్యం దుకాణాలను తగ్గిస్తూ ఒకవైపు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు మద్యం ధరలు కూడా అమాంతం పెంచటంతో ఆ ప్రభావం మద్యం అమ్మకాలపై పడుతోంది. ఈ ఐదురోజుల్లో  చిత్తూరులో అత్యధికంగా అమ్మకాలు జరగ్గా,  శ్రీకాకుళం, అనంతపురంలలో తక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి. 

 

ఇక ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరిలో 409 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో అతి తక్కువగా 90 మద్యం దుకాణాలు మాత్రమే నడుస్తున్నాయి. ఓవరాల్ గా పెరిగిన మద్యం ధరలు మందుబాబులకు షాక్ ఇస్తున్నాయని, అమ్మకాలపై ప్రభావం చూపిస్తున్నాయనే అంశం స్పష్టమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: