విశాఖ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తున్నాయి. హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా డిమాండ్ చేయగా.. నిపుణులు లేకుండా విచారణ కమిటీ ఏంటంటూ చంద్రబాబు ప్రశ్నించారు. లోతైన విచారణ జరపాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.

 

విశాఖ ప్రమాదంపై ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యింది. ముఖ్యమంత్రి పర్యటనతో పాటు భారీ పరిహారం ప్రకటించి ఊరట కల్పించారు. మంత్రులు, అధికారులను అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించమని చెప్పారు. మృతుల సంఖ్య కట్టడి కావడం.. బాధితులు కోలుకోవడంతో పరిస్థితి చక్కబడినట్లే కనిపించింది. అయితే స్థానికుల ఆందోళనలతో ఆ ప్రాంతం వేడెక్కింది. సంస్థపై చర్యలతో పాటు....కంపెనీని కూడా తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. 

 

ఇదే సమయంలో ప్రభుత్వ చర్యలను ప్రతిపక్షం కూడా గట్టిగా ప్రశ్నిస్తోంది. కోటి ఇస్తే సరిపోతుందా అనే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. పరిహారంతో ప్రాణాలు తిరిగొస్తాయా అని ప్రశ్నించారు. ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు....ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ అధికారులతో విచారణ చేయడాన్ని తప్పు పట్టిన చంద్రబాబు.. నిపుణులు లేకపోతే వాస్తవాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుంటే ప్రజలు రోడ్లమీద ఎందుకు నిద్రిస్తారని నిలదీశారు. కోటి పరిహారం ఇవ్వడం మంచిదే అంటున్న టిడిపి.. కంపెనీ నుంచి ఎక్కవ రాబట్టే అవకాశం ఉంటే ఎందుకు ఆ దిశంగా ప్రయత్నం చెయ్యలేదని ప్రశ్నిస్తోంది. కంపెనీతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందనే అనుమానాలు కలుగుతున్నాయిని టిడిపి నేతలు అంటున్నారు. టీడీపీ నేతల బృందం కేజీహెచ్ లో బాధితుల్ని పరామర్శించింది.

 

మరోవైపు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నత స్థాయి దర్యాప్తుకు డిమాండ్ చేశారు. సిఎం జగన్ కు లేఖ రాసిన కన్నా.. హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తామని అభిప్రాయపడ్డారు. విచారణ కమిటీలో ఆ రంగానికి చెందిన నిపుణులు ఉండేలా చూడాలని జగన్ కు రాసిన లేఖలో కన్నా పేర్కొన్నారు. విష వాయువు కారణంగా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి.. స్థానికులకు జీవిత కాల హెల్త్ కార్డ్ ఇవ్వాలని కూడా బిజెపి డిమాండ్ చేసింది.

 

కోటి పరిహారంతో స్థానికుల నుంచి రాజకీయ పక్షాల వరకు అంతా సర్ధుకుంది అనే అభిప్రాయం ముందుగా వ్యక్తమైంది. అయితే స్థానికుల ఆగ్రహావేశాలతో  పరిస్థితి మొదటికొచ్చింది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ఉదాసీనంగా ఉందంటూ ఆరోపణలు మొదలు పెట్టాయి. కంపెనీ తెరుస్తారు.. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటపైనా ప్రతిపక్షాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: