ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు క‌రోనా క‌ల‌కలం కొన‌సాగుతోంది. ఈ మ‌హ‌మ్మారి మ‌నుషుల జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న ఉదంతంలో... మ‌న పొరుగు దేశ‌మైన డ్రాగ‌న్ కంట్రీ దోషిగా నిల‌బ‌డుతోంది. ఈ స‌మ‌యంలో ఆయా దేశాలు, రాష్ట్రాలు త‌మ త‌మ ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం క్రియాశీలక అడుగులు వేస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క‌మైన ప్రతిపాద‌న‌లు సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో చైనా నుంచి తమ పరిశ్రమలను తరలించాలని అమెరికా, జపాన్‌ లాంటి అనేక దేశాలు నిర్ణయించుకుంటున్నాయి. దీంతో ఆ దేశాలకు భారత్‌, ప్రత్యేకించి తెలంగాణ ప్రత్యామ్నాయంగా కనిపించేలా కేసీఆర్‌, కేటీఆర్ కృషి చేస్తున్నారు.

 

క‌రోనా ప‌రిణామాల నేప‌థ్యంలో చైనా నుంచి తమ పెట్టుబడులను, పరిశ్రమలను తరలించాలని పలు దేశాలు భావిస్తున్నాయి.  చైనాకు ప్రత్యామ్నాయంగా అవి భారత్‌వైపు చూస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే బహుళజాతి సంస్థలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించేలా తెలంగాణ స‌ర్కారు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఖ్యాతినార్జించిన హైదరాబాద్‌.. విదేశీ సంస్థలను ఎక్కువగా ఆకర్షిస్తుండటమే ఇందుకు కారణం. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నది. దేశానికి వచ్చే పరిశ్రమల అవసరాలు, డిమాండ్లు, ప్రాధాన్యాలను తెలుసుకుని తదనుగుణంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించేందుకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ తయారు చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. 

 

విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ దాదాపు 14 రంగాలకు ప్రాధాన్యమిస్తున్నది. ఐటీ, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, విద్యుత్‌, ప్లాస్టిక్‌, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, ఏరోస్పేస్‌, ఆటోమొబైల్స్‌, సౌరశక్తి, నిర్మాణ రంగాలను ప్రోత్సహిస్తున్నది. ఈ రంగాల‌లో ఊపు సాధించ‌డంతో పాటుగా 
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ‌కు పెట్టుబ‌డులు సాధించేలా మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలను ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివరించిన మంత్రి కేటీఆర్‌.. పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ సమాజానికి ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఇప్పుడు పారిశ్రామికంగా అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, మానవవనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని విదేశీ సంస్థలకు చాటి చెప్పేలా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వ‌ర‌లో వీటిని ఆయా కంపెనీల అధినేత‌ల‌కు వివ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: