సినీరంగం, రాజకీయ రంగాల్లో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఎక్కడైతే చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాయో.. ఎక్కడ గెలుపు ఓటములను అస్సలు ఊహించలేమో.. అక్కడ ఆటోమేటిగ్గా సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఇవి మరీ విచిత్రంగా లాజిక్ లేకుండా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా.

 

 

ఇంతకీ విషయం ఏంటంటే.. మొన్న విశాఖలో గ్యాస్ లీక్ ఘటన సమయంలో బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్ కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లారు కదా.. అయితే అసలు కేజీహెచ్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి వెళ్తే.. ఆ తర్వాత ఆయన పదవి పోతుందట. ఇలాంటి ఓ సెంటిమెంట్ రాజకీయ వర్గాల్లో ఉన్నదట. ఈ విషయాన్ని వెల్లడించారు విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.

 

 

ఎన్టీఆర్‌ 1995లో విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన పదవి పోయింది. ఆ భయంతో ఆ తర్వాత ఏ సీఎం అక్కడికి వెళ్లలేదు. 25 ఏళ్ల తర్వాత జగన్‌ ధైర్యం చేసి మళ్లీ కేజీహెచ్‌లో అడుగుపెట్టారు అంటూ పీవీపీ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. పదవి కన్నా ప్రజాసంక్షేమం ప్రధానంగా భావించి జగన్‌ కేజీహెచ్‌కి వెళ్లారని పీవీ ప్రసాద్ ప్రశంసించారు.

 

 

అయితే ఇప్పుడు పీవీపీ కామెంట్లు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. జగన్ ప్రయత్నాన్ని అభినందించడం మంచిదే.. ఈ పని మామూలుగా చేయవచ్చు కదా.. ఓ నెగిటివ్ ప్రచారాన్ని మళ్లీ ఎందుకు వెలుగులోకి తీసుకురావడం.. అందులోనూ జగన్ పదవి పోతుందా అనే ఊహాగానాలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పీపీవీకి అవసరమా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: