అమ్మ‌.. ఈ పేరులో ఉండే మాధుర్యం మ‌రెందులోనూ దొర‌క‌దు. పుట్టే ప్రతి జీవికీ... దిక్సూచి త‌ల్లే.  అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. మాటల్లో చెప్పలేని బంధం తల్లీ బిడ్డలది. అందుకే తల్లే బిడ్డకు మొదటి గురువు. ఇక ఈ రోజు మదర్స్ డే.. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన తల్లిని ఒక్క రోజు గుర్తు చేసుకుంటే సరిపోతుందా ? అమ్మ తన పిల్లల కోసం పడే తపనకు , వారి ఉన్నతి కోసం చేసే కష్టానికి జీవితకాలం అమ్మకు ఊడిగం చేసినా సరిపోదు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఆమె మనకు అందించే ప్రేమలో కొంచెం తిరిగిచ్చినా చాలు.. ఆ తల్లి గుండె సంతోషంతో నిండిపోతుంది.

 

సృష్టి లోనే అత్యంత అద్భుతమైన పదం అమ్మ. అందుకే అంటారు సృష్టి కర్త అయిన బ్రహ్మ ను సృష్టించింది కూడా ఒక అమ్మే అని. అలాంటి అమ్మ విలువ ఎంత అంటే పంచ భూతాలు సైతం చెప్పలేనంత‌. ఇక అమ్మ ప్రేమ ఎంత గొప్ప‌దో చెప్ప‌డానికి కొన్ని కొన్ని సంఘ‌ట‌న‌లు నిద‌ర్శ‌నంగా మార‌తాయి. తాజాగా కూడా ఇలాంటి సంఘ‌ట‌నే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  పైన చూసిన చిత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని ఒక జిల్లా ఆసుపత్రిలో తీసింది. ఇటీవ‌ల కరోనా పాజిటివ్ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే త‌ల్లికి క‌రోనా పాజిటివ్ కావ‌డంతో బిడ్డ‌ను ప్ర‌త్యేక వార్డులో ఉంచారు.

 

అయితే త‌ల్లి స్ప‌ర్శ త‌గ‌ల‌ని ఆ బిడ్డ త‌ల్ల‌డిల్లిపోయింది. ఈ క్ర‌మంలోనే బిడ్డ ఏడుపు అందుకుంది. దీంతో డాక్టర్లు తల్లి తన బిడ్డను వీడియో కాలింగ్ ద్వారా లాలించే అవకాశం కల్పించారు. విచిత్రం ఏంటంటే.. వీడియో కాల్‌లో తల్లిని చూడగానే పిల్లవాడు ఏడుపు ఆపేసాడు. ఇక  ఆమె జోల పాట పాడుతుంటే హాయిగా నిద్రపోయాడు. అయితే మదర్స్ డే సందర్భంగా ఈ చిత్రం సర్వత్రా వైరల్ గా మారింది. అమ్మ ప్రేమ ఎంత గొప్ప‌ది.. అమ్మ‌కు, బిడ్డ‌కు మ‌ధ్య ఉన్న అపూర్వ‌మైన బంధానికి ఈ ఘ‌ట‌న నిద‌ర్శ‌నంగా నిలిచింది. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: