కార్మికుల వలస ప్రయాణం... పరిశ్రమలకు శాపంగా మారింది. ఎక్కడిక్కడ పనులు ఆగిపోయి కుదేలయ్యాయి పరిశ్రమలు. చేయాల్సిన పనులు చాలా ఉన్నా... పనిచేసే వాళ్లు లేక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నాయి పరిశ్రమవర్గాలు. ఇదే పరిస్థితి కొనసాగితే... పరిశ్రమలకు గడ్డు పరిస్థితి ఎదురుకాకతప్పదు. 


కరోనా ప్రభావం, లాక్‌ డౌన్‌ వలస కార్మికుల పొట్టగొట్టాయి. పరిశ్రమలూ అంతే దెబ్బతిన్నాయి. నిర్మాణ, ఇతర రంగాల్లో గణనీయమైన ఉపాధి అవకాశాలు ఉండటం వల్ల... అనేక రాష్ట్రాల నుంచి వలస కూలీలు హైదరాబాద్ కు తరలివస్తారు. జార్ఘండ్‌, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్రాల నుంచి ఈ వలసలు ఉంటాయి. వీరంతా ఎక్కువగా భవన నిర్మాణం, పారిశ్రామిక రంగాల్లో పనులు వెతుక్కుంటారు.  ముఖ్యంగా భవన నిర్మాణం రంగంలో పనిచేసే కార్మికులే అధికం. దాదాపు 80 శాతం ఉంటుంది వీరి సంఖ్య.  వలస కార్మికులు అందుబాటులో లేకపోతే తీవ్ర ప్రభావానికి లోనయ్యేది  భవన నిర్మాణ  రంగమే.  లాక్‌డౌన్‌ కాలంలో తినటానికి తిండి లేక ఆకలితో అలమటించిన ఈ వర్గం ఇప్పుడు సొంత రాష్ట్రాలకు మళ్ళుతోంది. 

 

వలస కూలీలు చేసే కష్టమైన పనులు స్థానిక కార్మికులు చేయలేరు. పైగా జీతాల చెల్లింపుల్లోనూ తేడాలుంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తక్కువ జీతానికే పనికి కుదురుతారు. ఇళ్ళను వదిలి వస్తారు కనుక కొద్ది నెలల పాటు ఎటువంటి పరిస్థితులున్నా పని చేస్తారు. అదే స్థానిక కార్మికులైతే పని వాతావరణం నచ్చకపోయినా, తగిన ఆదాయం రాకపోయినా మరో చోట ఉపాధి వెతుక్కుంటారు. వలస కార్మికులు లేకపోతే భవన నిర్మాణం రంగం కుదేలవుతుంది. లాక్‌డౌన్‌ తో ఇప్పటికే ఇబ్బందుల్లో పడ్డ ఈ రంగం మరికొద్ది నెలల పాటు ఈ ప్రభావాన్ని
ఎదుర్కోక తప్పదు. 

 

నిర్మాణ రంగమే కాదు.. ఎమ్ఎస్ఎమ్ఇ రంగం కూడా వలస కార్మికుల మీదే ఆధారపడింది. వలసల వల్ల అధికమొత్తంలో నష్టాలనూ ఎదుర్కొంటోంది ఎమ్ఎస్ఎమ్ఇ. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో పని చేసే వలస కార్మికుల శాతం 60 నుంచి 70 వరకు ఉంటుంది. ఎమ్ఎస్ఎమ్ఇల్లో శారీరక శ్రమ ఎక్కువ. ఆ పని చేయడానికి స్థానిక కూలీలకంటే వలస కూలీలే సరిపోతారు. అందువల్ల వీరు లేకపోతే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పూర్తి స్థాయిలో పట్టాలెక్కే పరిస్థితి లేదు. అందుబాటులో ఉన్న కొద్ది మందితో తమ యూనిట్లను నడుపుకోవాల్సి రావటం చిన్న పారిశ్రామిక వేత్తలకు తలకుమించి భారమవుతోంది. 

 

హోటల్‌ రంగం వంటి చోట్ల కూడా కొంత వరకు వలస కార్మికులు ఉన్నా ..ఆ సంఖ్య నామమాత్రమే. పైగా వీరు లేకపోయినా ప్రత్యామ్నాయంగా స్థానికులతో సర్దుబాటు చేసుకోగలుగుతారు. కాని భవన నిర్మాణ రంగం మాత్రం తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టాలు ఎదుర్కోక తప్పదంటున్నారు  ఈ రంగలోని నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: