తాజాగా కర్నూలు జిల్లా బెలుం సింగవరంలో తీవ్ర విషాదకరమైన సంఘటన చోటు చేసుకొని ఆ ఊరి ప్రజలను కంటతడి పెట్టిస్తుంది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో ముగ్గురు చిన్నారులు సరదాగా ఈత కొడదామని గ్రామ శివార్లలోని చిన్న కాలువ వద్దకు వెళ్లారు. అనంతరం ఆ కాలువలోకి దూకి ఈత కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా... అనుకోకుండా వారందరూ బురదగుంటలో పడిపోయారు. ఆ బురద గుంట చాలా పెద్దదిగా ఉండటం తో వాళ్ళు అక్కడి నుండి బయటపడలేక పోయారు. ఎంత ప్రయత్నించినా బురదగుంట నుండి పైకి రాలేక లోతుగా కూరుకుపోయి మరణించారు. ఈ దారుణమైన సంఘటనలో మృతి చెందిన వారిని యాస్మిన్, లోకేష్, వంశీ గా గ్రామస్తులు గుర్తించారు.


వాస్తవానికి వేరే పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు సుబ్బమ్మ ల దంపతుల కుమారులు అయిన లోకేష్, వంశీ ఈ దుర్ఘటనలో మృత్యువాతపడ్డారు. లాక్ డౌన్ కారణంగా తమ పాఠశాలలకు సెలవులు రావడంతో వీళ్ళిద్దరూ తన అమ్మమ్మ ఊరైన బెలుం సింగవరానికి వచ్చారు. తదనంతరం తమ పిన్ని కుమారుడు అయిన యాస్మిన్ తో బాగా ఆడుకోవడం ప్రారంభించారు.


ఇందులోని భాగంగానే ఈ రోజు ఉదయం 6-7 గంటల ప్రాంతంలో సరదాగా ఈతకు వెళదామని వెళ్లి బురదగుంటలో పడి ఊపిరాడక చనిపోయారు. స్థానికులు ఈ చిన్నారులని గమనించారు కానీ అప్పటికే వారి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. హుటాహుటిన బాలురిని బయటకు తీశారు కానీ ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. మృతుడు లోకేష్ తల్లిదండ్రులు తమ కొడుకు చనిపోయాడన్న నిజాన్ని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోతున్నారు.


ఇప్పటికే ఎంతో మంది చిన్న పిల్లలు సరదాగా ఈతకు అని వెళ్లి ప్రాణాలు కోల్పాయారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా... మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరూ ఆపలేకపోతున్నారు. కనీసం తల్లిదండ్రులు అయిన వారి పిల్లలకు చెరువులు, కాల్వలు ఎంత ప్రమాదకరమో చెప్పి భయపెట్టాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: