కరోనాతో పోరాటం కొత్త పరిశోధనలకే కాదు భాగస్వామ్యాలకు కూడా అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌... ప్రతిష్టాత్మక ICMR మధ్య పార్ట్‌నర్‌షిప్‌ కుదిరింది. ఈ రెండు సంస్థలు కలిసి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సీన్‌ను తయారు చేస్తున్నాయి.  

 

కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోడానికి ఇప్పటికే వ్యాక్సీన్‌ తయారు చేస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌- BBIL మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ - ICMR అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సీన్‌ కార్యక్రమంలో భాగస్వామి కాబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని తయారు చేయబోతున్నాయి. 


   
ICMRకు చెందిన పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ - NIVలో సేకరించిన కరోనా వైరస్‌ జాతిని... ఇప్పటికే భారత్‌ బయోటెక్‌కు అందజేసింది. వ్యాక్సీన్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌కు NIVతో పాటు తాము పూర్తి సహకారం అందజేస్తామని ICMR తెలిపింది. వ్యాక్సీన్‌ అభివృద్ధి, జంతువులపై ప్రయోగాలు, క్లినికల్‌ విశ్లేషణ వంటి వాటికి అవసరమైన అనుమతుల్ని భారత్‌ బయోటెక్‌, ICMR ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో సాధిస్తాయని వివరించింది. అయితే, క్లినికల్‌ ట్రయల్స్‌ గురించి ICMR ప్రస్తావించలేదు. మరోవైపు... ICMR, NIVతో కలిసి పని చేయడం గర్వంగా ఉందని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్ల కృష్ణ వ్యాఖ్యానించారు. కరోనాపై దేశం విజయం సాధించేందుకు ఏ కార్యక్రమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

 

కరోనాను అరికట్టేందుకు కోరోఫ్లూ అనే వ్యాక్సీన్‌ తయారు చేస్తున్నట్టు ఏప్రిల్‌ 3న భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ముక్కులో వేసుకునే ఈ చుక్కల మందు మనుషులకు ఎంతో సురక్షితమైనదిగా తెలిపింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌తో పాటు వ్యాక్సీన్ల తయారీ కంపెనీ ఫ్లూ జెన్‌తో కలిసి కోరోఫ్లూ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు అప్పట్లో భారత్‌ బయోటెక్‌ తెలిపింది. వ్యాక్సీన్‌ను తయారు చేయడంతో పాటు క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి, ప్రపంచ వ్యాప్తంగా వినియోగానికి 30 కోట్ల డోసులను సిద్ధం చేస్తామని ప్రకటించింది. అలాగే నిరుపయోగంగా ఉన్న ర్యాబిస్‌ వెక్టర్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నట్టు ఏప్రిల్‌ 20న భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేదుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ముందుకొచ్చింది. 


    
మొత్తానికి కరోనా వ్యాక్సీన్ల తయారీలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌తో కలిసి పని చేయడానికి ముందు రావడం గర్వించగ దగ్గ అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: