కేరళలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. అయితే... ఇది కేవలం ఆదివారాలు మాత్రమే అమలవుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడతుందని భావిస్తోంది కేరళ సర్కార్‌. 

 

ప్రస్తుతం దేశంలో మూడో విడత లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కానీ ఇది కేవలం రెడ్‌ జోన్లకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌పై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది కేంద్రం. దీంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ ఆదివారాలు లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. 

 

కేరళలో 503 మందికి కరోనా సోకగా నలుగురు చనిపోయారు. 484 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లిపోగా... కేవలం 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వస్తున్న వాళ్ల వల్ల మళ్లీ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల కఠిన నిబంధనలు విధిస్తోంది పినరయి విజయన్‌ సర్కార్‌. ఆదివారాలు లాక్‌డౌన్‌ ఉన్నా సరే నిత్యవసారాల దుకాణాలు తెరచుకుంటాయి. పాలు సేకరణ, పంపిణీ, న్యూస్‌ పేపర్లు పంపిణీ కొనసాగుతాయి. ఆస్పత్రులు, మెడికల్‌ స్టోర్లు, మెడికల్‌ ల్యాబ్‌లు, మీడియా సంస్థలు నడుస్తాయి. అయితే, జనం గుమిగూడడానికి వీల్లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు మినహాయింపు ఇచ్చింది. అయితే, నిర్మాణ పనులను కొనసాగించుకోడానికి వీలు కల్పించింది. 

 

ఆదివారాలు కేవలం అత్యవసర వైద్యం అవసరమైతేనే జనం ఇళ్ల నుంచి బయటకు రావాలని స్పష్టం చేసింది కేరళ సర్కార్‌. ఎమర్జెన్సీ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, కరోనా కంటైన్మెంట్‌ పనులు చేపట్టే వాళ్లతో పాటు పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్ల నుంచి పాస్‌లు పొందిన వాళ్లకు మినహాయింపు ఉంటుంది. 

 

కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటు కాలుష్యం తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ఆదివారాలు లాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఈ విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది కేరళ సర్కార్‌. ఇదిలా ఉంటే... వందే భారత్‌ మిషన్లో భాగంగా అబుదాబి, దుబాయ్‌ల నుంచి ప్రత్యేక విమానాలలో కొచ్చీ చేరుకున్న 363 మంది NRIలలో ఇద్దరికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో వాళ్లను చికిత్స కోసం కోవిడ్‌ ఆస్పత్రికి తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: