తెలంగాణలో  పదవ  తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలయినట్లుగా సోషల్ మీడియా  లో  జరుగుతున్న  ప్రచారాన్ని విద్యార్థులు , వారి తల్లితండ్రులు నమ్మొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితాఇంద్రా రెడ్డి కోరారు . ఈనెల 18 వతేదీ  నుంచి 21 వ తేదీ వరకు పదవ  తరగతి పరీక్షలు  ఉదయం , మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు కొంతమంథి వ్యక్తులు సోషల్  మీడియాలో ప్రచారం చేస్తున్నారు . ఈ నెలఖారు వరకు పదవ పరీక్షలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల మీడియా సమావేశం లో పేర్కొన్నారు .

 

కెసిఆర్ ఆదేశాల మేరకు ఈనెల ఏడవతేదీ విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితాఇంద్రా రెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు .పదవతరగతి పరీక్షలపై హైకోర్టులో కేసు ఉండడంతో, విద్యాశాఖ  తరపున అఫిడవిట్  దాఖలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి మీడియాకు తెలిపారు . హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పదవతరగతి  పరీక్షలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి  కెసిఆర్ స్పష్టం చేసినప్పటికీ , కొంతమంది  ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు షెడ్యూల్  సృష్టించి సోషల్  మీడియా లో విస్తృత ప్రచారం చేస్తున్నారు . సోషల్ మీడియా లో జరగుతున్న తప్పుడు ప్రచారాన్ని  గుర్తించిన విద్యాశాఖ , ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది . పదవ తరగతి పరీక్షల  నిర్వహణపై హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని వెల్లడించింది . హైకోర్టు ఆదేశించగానే పరీక్షల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు .  

 

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించే సమయానికి పదవతరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి . అయితే పరీక్షలను యధావిధిగా నిర్వహించి విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టడం ఇష్టం లేక తెలంగాణ సర్కార్ పరీక్షల నిర్వహణ ను వాయిదా వేయాలని నిర్ణయించింది . అప్పటి నుంచి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక విద్యార్థులు , వారి తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారు . అదే అదనుగా సోషల్ మీడియా లో కొంతమంది తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: