దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో మొదట్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమం వల్ల దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఘటన వల్ల దేశవ్యాప్తంగా కొందరు జనాలు ముస్లింలు నిర్వహించే షాపుల్లో వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. 
 
దీంతో ఒక బేకరీ షాపు యజమాని తన షాపులో ముస్లింలు ఎవరూ పని చేయడం లేదంటూ ప్రకటన రూపొందించాడు. షాపు యజమాని జైన్ మతస్తులు మాత్రమే తన షాపులో స్వీట్లు తయారు చేస్తారంటూ రూపొందించిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెన్నైలోని టీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి షాపు యజమానిని అరెస్ట్ చేశారు. 
 
పోలీసులు షాపు యజమానిపై 153, 153ఏ, 505, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 6000 దాటగా ఇప్పటివరకు 40 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
ఏపీలో ఈరోజు 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1980కు చేరింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 2000కు చేరువలో ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 31 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1163కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: