దాదాపు 45 రోజుల తర్వాత భారత దేశంలో మద్యం దుకాణాలు తెరుచుకోవడం తో లక్షల మంది మందు బాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. మద్యం విక్రయాల వలన ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త కుదుటపడుతున్నాయి. ఐతే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం మద్యం విక్రయాలు నిషేధించబడ్డాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు వేల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా... గత వారం రోజులుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.


ఇటువంటి గడ్డు పరిస్థితులలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడంతో... మందు బాబులు భౌతిక దూరాన్ని పాటించకుండా మద్యం సీసాల కోసం అన్ని నిబంధనలను బ్రేక్ చేశారు. మరోవైపు ఆడవారు కూడా మద్యం దుకాణాలు తెరవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న వేళ.... మందుబాబులు అందరూ ఏ జాగ్రత్తలు తీసుకోకుండా కలవడమనేది సరి కాదని... ఇలా ఐతే కరోనా ఇంకా విజృంభిస్తుంది అని కొంతమంది న్యాయవాదులు మద్యం విక్రయాలను నిషేధించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


శుక్రవారం నాడు న్యాయవాదుల పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు... మద్యం విక్రయాలను నిషేధించాలని, కావాలంటే ఆన్లైన్ లో మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని తీర్పునిచ్చింది. ఐతే మద్యం విక్రయాలు ఆన్లైన్ ద్వారా అన్ని ప్రదేశాలలో జరగడం అసాధ్యం అని తెలుపుతూ.... మద్యం అమ్మకాలు జరపవద్దని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తూ సుప్రీం కోర్టు కెక్కింది. మద్యం అమ్మకాలు జరగకపోతే రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది. ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో గత 45 రోజులకు పైగా ఏ వ్యాపార సంస్థలు, దుకాణాలు, ప్రజా రవాణా, ముడి చమురు అమ్మకాలు జరగక టాక్స్ ల రూపంలో రావాల్సిన డబ్బులు రావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: