ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రజల్లో కరోనాపై భయం పోగొడుతూనే ప్రజలు భౌతికదూరం పాటించేలా చేయాలని సూచించారు. మే 17 తరువాత రాష్ట్రంలో అనుసరించాల్సిన హెల్త్ ప్రోటోకాల్ గురించి ఆయన చర్చించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి రాబోతున్న వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 
 
ఎవరైతే ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తారో వారి వివరాలను వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, హెల్త్‌ అసిస్టెంట్‌కు అందజేయాలని సూచించారు. వారిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని... అందుకోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ చెప్పారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారు 11 చెక్ పోస్టుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు జగన్ కు చెప్పారు. 
 
ఇతర రాష్ట్రాల విమానాశ్రయాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిని విశాఖ, విజయవాడ, తిరుపతిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని అధికారులు జగన్ కు తెలిపారు. ఇప్పటికే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ఏర్పాట్లు చేశామని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని... కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. 
 
మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 50 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1980కు చేరింది. రాష్ట్రంలో మృతుల సంఖ్య 45కు చేరింది. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 31 కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1163కు చేరింది.                     

మరింత సమాచారం తెలుసుకోండి: