కరోనా వైరస్ ఇప్పుడు ప్ర‌బౄవితం చేయ‌ని దేశం ఏదీ లేదు. చిన్నా చిత‌క దేశాలు మొద‌లుకొని అగ్ర‌రాజ్యం అమెరికా వ‌ర‌కు దేశాల‌న్నీ ప్ర‌భావితం అవుతున్నారు. ఈ  మహమ్మారితో అమెరికా ఘోరంగా దెబ్బతిన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలో 12,84,000 మంది కొవిడ్‌-19కు గురవగా.. దాదాపు 77 వేల మంది మరణించారు. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో అనేక ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అమెరికా రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

 


కొవిడ్‌-19 కారణంగా వేలాదిగా ప్రజలు దవాఖానల్లో చేరి చికిత్స పొందుతుండటంతో వైద్యులు, వైద్యసిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దాంతో క‌రోనాపై పోరాటంలో భాగంగా, తమ ప్రజల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం విదేశీ డాక్టర్లు, నర్సులకు గ్రీన్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వినియోగించని దాదాపు 40 వేల గ్రీన్‌కార్డులను వీరికి అందించాలని నిర్ణయించారు. కరోనా వ్యాధిగ్రస్థులకు సేవలందించేందుకుగాను 25వేల మంది నర్సులు, 15 వేల మంది వైద్యులకు గ్రీన్‌కార్డులు పంపనున్నారు. దీనికి అమెరికన్‌ చట్టసభ సభ్యులు కాంగ్రెస్‌లో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. దాంతో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్యులు, నర్సులను విదేశాల నుంచి రప్పించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు తీర్మానించారు. కాగా, వైద్యులు అమెరికా వెళ్లాలంటే ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

 

ఇదిలాఉండ‌గా, కరోనా కారణంగా అమెరికాలో దాదాపు 3.3 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో హెచ్‌1బీ, హెచ్‌2బీ వంటి పని ఆధారిత వీసాలపై తాత్కాలికంగా నిషేధం విధించి, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వలస విధానంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. హెచ్‌1బీ వంటి పని ఆధారిత వీసాలు, పనిచేసుకునేందుకు వీలు కల్పించే విద్యార్థి వీసాలపై తాత్కాలికంగా నిషేధం విధించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' వెల్లడించింది. వచ్చే నెలలోనే దీనిపై ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదే జరిగితే భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: