ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 50 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎక్కువ కేసులు చిత్తూరు జిల్లాలోనే వచ్చాయి. కర్నూలులో పర్యటించిన కేంద్ర బృందం.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. 

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1980కి చేరింది. కరోనాతో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 45కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 925 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1010 మంది చికిత్స పొందుతున్నారు.

 

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 112కి చేరింది.  కొత్తగా అనంతపురం జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 6, కడప జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. 

 

కర్నూలు జిల్లాలో కేంద్ర వైద్య బృందం పర్యటించింది. జిల్లాలో ఇప్పటి వరకు 540 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. నంద్యాల పట్టణంలో ఒకే కుంటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో పర్యటించిన కేంద్ర వైద్య బృందం.. జిల్లా కలెక్టర్, నోడల్ అధికారులతో సమీక్ష జరిపింది. ఏపీలో కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వైద్య పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వ్యూహం మార్చాలని కర్నూలు జిల్లా అధికారులకు కేంద్ర బృందం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: