క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఈ స‌మ‌యంలో అందరి దృష్టి మ‌నవాళ్ల‌కు మెజార్టీ మందికి ఉపాధి క‌ల్పిస్తున్న హైద‌రాబాద్‌పైనే ప‌డుతోంది. తాజాగా హైద‌రాబాద్ విష‌యంలో ఆస‌క్తిక‌ర స‌మాచారం వ‌చ్చింది. వైరస్‌ వ్యాప్తిలో మన భాగ్యనగరంలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. దేశం మొత్తం కేసుల్లో ముంబై 16.91 శాతంతో ముంబై మొదటిస్థానంలో, 11.37శాతం కేసులతో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. ఇక 1.08 శాతం కేసులతో భోపాల్‌, 1.20 శాతం కేసులతో హైదరాబాద్‌ చివరి రెండుస్థానాల్లో నిలిచాయి.  

 


దేశవ్యాప్తంగా 14 ప్రధాన నగరాల్లో కరోనా కేసుల తీరును కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. అత్యధిక కేసులతో ముంబై మొదటిస్థానం, ఢిల్లీ రెండోస్థానంలో నిలిచాయి. అత్యల్ప కేసులతో భోపాల్‌, హైదరాబాద్‌ చివరి నుంచి ఒకటి రెండుస్థానాలను దక్కించుకున్నాయి. ముంబైతోపాటు ఇతర నగరాల్లో కేసుల తీవ్రత ఎలా ఉన్నది? దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో  వాటిశాతం ఎంత అనే విషయాలను వెల్లడించింది. 

 

ఇదిలాఉండ‌గా, గ్రేటర్‌లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య మరోసారి ఎగబాకింది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య శనివారం ఒక్కసారిగా 30కి చేరింది. తాజాగా నమోదైన వాటిలో 21  కేసులు నగరంలోనే నమోదు అవ్వడం గమనార్హం. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లిలో ఒకే కుటుంబంలో  7కేసులు, రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. సుల్తాన్‌బజార్‌లో ఒకే కుటుంబంలోని ముగ్గురితో పాటు వివిధ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ పరిధిలో కరోనాతో ఒకరు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఆదివారం నాటికి  గత 24 గంటల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కొత్త  కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని  కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఆదివారం ఆయన న్యూడిల్లీలోని మండోలి ప్రాంతంలోని దవాఖానను సందర్శించి అక్కడ కొవిడ్‌-19 వ్యాధిగ్రస్థులకు అందిస్తున్న చికిత్సను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: