దేశంలో కరోనా విలయం ఏ మాత్రం తగ్గడం లేదు. కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించినా, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నా... కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3277 కొత్త కేసులు నమోదు కాగా.. 128 మంది కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. 

 

దేశంలో ఇప్పటివరకూ 62 వేల 939 మందికి కరోనా సోకింది. వీరిలో 2 వేల 109 మంది చనిపోయారు. 19 వేల 359 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 41 వేల 472 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. సగటున రోజూ మూడు వేల కేసులు, వంద మరణాలు సంభవిస్తున్నాయి. 

 

మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజుకు కొత్తగా వెయ్యి కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20 వేల 228కి చేరగా .. 779మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 12వేలు దాటగా పుణెలో 2 వేల 700కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత అత్యధిక తీవ్రత గుజరాత్‌లో ఉంది. అంతేకాకుండా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో మరణాల రేటు కలవరపెడుతోంది. గుజరాత్‌లో ఇప్పటివరకు మొత్తం 7 వేల 796 కేసులు నమోదు కాగా 472మంది మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 3 వేల 614 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 215 మంది మరణించారు. 

 

దేశ రాజధాని ఢిల్లోలో వైరస్‌ బారినపడినవారి సంఖ్య 6 వేల 542కి చేరగా 73మంది మరణించారు. తమిళనాడులో వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 6 వేల 535కి చేరగా 44మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లోనూ కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 171మంది మృత్యువాతపడగా మొత్తం 1786 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 3 వేల 708 కేసులు నమోదుకాగా 106 మంది మరణించారు. 

 

ఆపత్కాలంలో విధులు నిర్వర్తిస్తోన్న వైద్యులు, పోలీసులు కరోనా వైరస్‌ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఈ మహమ్మారి అక్కడి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 786మంది పోలీసులకు ఈవైరస్‌ సోకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వైరస్‌ బారినపడి మరణించిన పోలీసు సిబ్బంది సంఖ్య ఏడుకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

 

ప్రతి రోజూ 95 వేల మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కోటిన్నర మందికి పరీక్షలు చేసినట్టు తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: