ఏపీలో కరోనా వ్యాప్తి, వలస కార్మికుల తరలింపుపై సీఎం జగన్ సమీక్షించారు. విదేశాల నుంచి వస్తున్న వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. లాక్ డౌన్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రోటోకాల్ తయారు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షాపులు తెరిచే సమయం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

ఏపీలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. ఇతర రాష్ట్రాల్లోని ఏపీకి చెందిన వలస కార్మికులు, రాష్ట్రంలోని వలస కార్మికుల తరలింపుపై చర్చించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారు సోమవారం నుంచి రావడం మొదలవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. అమెరికా నుంచి వచ్చేవారు వైజాగ్, విజయవాడ, తిరుపతే కాకుండా  ముంబై, హైదరాబాద్, చెన్నైలాంటి విమానాశ్రయాలకూ చేరుకుంటారని వెల్లడించారు. సీఎం ఆదేశాల ప్రకారం వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు అందించడానికి ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌ కేంద్రాలకు చేరడానికి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. 

 

లాక్‌డౌన్‌ అనంతరం అనుసరించాల్సిన హెల్త్‌ప్రోటోకాల్‌ అంశంపై కూడా జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి ఏపీలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి వైద్య పరిశీలన, పరీక్షలు చేయాలి, తర్వాత ఆ వ్యక్తి అనుసరించాల్సిన ఐసోలేషన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఒక ప్రోటోకాల్‌ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. వివిధ రాష్ట్రాలనుంచి 11 చెక్‌పోస్టుల ద్వారా ఏపీలోకి ప్రవేశిస్తారని అధికారులు చెప్పగా.. అక్కడ ఎలాంటి పద్ధతులు అనుసరించాలో ఆలోచించాలన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి పొందిన గమ్యానికి చేరుకోవడం వరకూ యాప్‌ద్వారా ట్రాక్‌ చేస్తామని అధికారులు చెప్పారు. ఆ వివరాలను  గ్రామంలో ఉన్న వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త, అలాగే ప్రతి సచివాలయంలో ఉన్న హెల్త్‌ అసిస్టెంట్‌కు చేరవేయాలని సీఎం సూచించారు. హోం క్వారంటైన్‌ పాటించేలా చేయడం, తర్వాత పరీక్షలు చేయించడం తద్వారా వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు, అవసరమైన ఆస్పత్రికి తరలించడం లాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలన్నారు జగన్. 

 

ప్రజల్లో భయాన్ని పోగొడుతూ.. భౌతిక దూరం లాంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, తద్వారా వైరస్‌తో సమర్థవంతంగా పోరాడగలమని సీఎం చెప్పారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున.. ఆమేరకు షాపులు తెరిచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: