అమెరికాలో కరోనా వైరస్ ఆగడం లేదు. మరణాల సంఖ్య కూడా తగ్గడం లేదు. కొత్తగగా మరో 1568 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 80వేలు దాటింది. అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

 

ప్రపంచంలో పది లక్షల కరోనా కేసులు దాటిన మొదటి దేశంగా ఏప్రిల్ 28న అమెరికా రికార్డు సృష్టించింది. ఇప్పుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో మూడో వంతు ఆ దేశంలోనే ఉన్నాయి. కరోనా ధాటికి అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ వణికిపోతోంది. ఇప్పటికే నలుగురు వైట్ హౌస్ సిబ్బందికి కరోనా సోకడంతో.. దేశ అత్యున్నత ఆరోగ్య అధికారులు కూడా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీతో పాటు సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ డైరక్టర్, ఎఫ్డీఏ కమిషనర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లారు. వైట్ హౌస్ సిబ్బందికి కరోనా రావడంతో.. వీరు ముగ్గురూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా డైలీ కరోనా టెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

అమెరికాలో 1930 ఆర్థిక మాంద్యం తర్వాత నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరడంతో.. లాక్ డౌన్ ఎత్తేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే టెస్లా లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని కోర్టుల్ని కూడా ఆశ్రయిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబంధనలు సడలించడం మినహా అమెరికా ముందు మరో మార్గం లేదు. ఇప్పటికే అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 80 వేలు దాటింది. న్యూయార్క్, న్యూజెర్సీలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. న్యూయార్క్ లో 3 లక్షల 43 వేల 409 కేసులు ఉండగా.. 26 వేల 771 మంది చనిపోయారు. న్యూజెర్సీలో లక్ష 38 వేల 579 కేసులు ఉండగా.. 9 వేల 118 మంది మరణించారు. 

 

కొవిడ్‌ ను సమర్థంగా ఎదుర్కోవడంలో అధ్యక్షుడు ట్రంప్‌ విఫలమయ్యారని ఇప్పటికే పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ట్రంప్ ను విమర్శిస్తున్న ఆడియో లీకైంది. తన హయాంలో పనిచేసిన సిబ్బందితో మాట్లాడిన ఒబామా.. ఎన్నికల్లో జో బిడెన్ కు మద్దతివ్వాలని కోరారు. సంక్షోభ సమయంలో
అందరితో కయ్యాలు పెట్టుకుంటున్న పాలకవర్గం ఉండడం విపత్తును మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: