ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌లో దుమ్ములేపుతున్నాడు. అచ్చం తన బ్యాటింగ్ మాదిరే ఇరగదీస్తున్నాడు. కూతురి కోరికతో టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్.. వరుస వీడియోలతో కుమ్మేస్తున్నాడు. ఫ్యాన్స్‌కు కావాల్సిన మజాను అందిస్తున్నాడు.

 

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వీరబాదుడుకు మారుపేరు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ మోతకు స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు ఎన్నో...! అదే జోష్‌ను టిక్‌టాక్‌లో కనబరుస్తున్నాడు వార్నర్‌. ఇటీవల టిక్‌టాక్‌లో అరంగేట్రం చేసిన ఈ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌‌.. వరుస వీడియోలతో ఫ్యాన్స్‌కు మంచి మజాను అందిస్తున్నాడు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ, తెలుగు సినిమాల్లోని డైలాగులు చెబుతూ టిట్‌టాక్‌ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నాడు. 

 

ఆ మధ్య అలవైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేశారు... వార్నర్ దంపతులు. అయితే... అల్లు అర్జున్‌లా డాన్స్‌ చేయడం చాలా కష్టమని, చాలా ప్రాక్టీస్‌ చేయాలని అన్నారు. 

 

లేటెస్ట్‌గా... కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన 'క్షత్రియ పుత్రుడు‌' సినిమాలోని 'సన్నాజాజీ పడాకా' అనే పాటకు తన సతీమణి, చిన్నారితో కలిసి డ్యాన్స్‌ చేశాడు... వార్నర్‌. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

 

డాన్స్‌తోనే కాదు... డైలాగులతోనూ సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాడు... వార్నర్‌. తెలుగు సినిమా డైలాగ్‌తో వార్నర్‌ తన అభిమానులను, నెటిజన్లను మెప్పించాడు. బ్లాక్‌ బస్టర్‌ చిత్రం పోకిరిలోని "ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను "అనే డైలాగ్‌ను టిక్‌టాక్‌ వీడియో చేసి, అభిమానులతో పంచుకున్నాడు. 

 

వీడియోను చూసిన పూరీ జగన్నాథ్‌ వార్నర్‌ను మెచ్చుకున్నాడు. భవిష్యత్తులో తన సినిమాలో రోల్ ఇస్తానని తెలిపాడు. అలాగే, రోహిత్‌ శర్మతో వార్నర్‌ చేసిన వీడియో ఛాటింగ్‌ కూడా క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంది. ఇలా తన బ్యాటింగ్‌తోనే కాకుండా, వీడియోలతో అభిమానులను ఖుషి చేస్తున్నాడు ఈ డైనమైట్‌ బ్యాట్స్‌మెన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: