దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య తగ్గడంతో రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చిందని అధికారులు భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా గత రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్న రాష్ట్రంలో 31 కేసులు నమోదు కాగా నిన్న 33 కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1196కు చేరింది. నమోదవుతున్న కేసుల్లో మెజారిటీ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు కాగా... ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అవుతోందని సమాచారం. నిన్నటివరకు గ్రీన్ జోన్ గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 కేసులు నమోదు కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో జిల్లాలోని అధికారుల్లో టెన్షన్ మొదలైంది. 
 
రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి వలస కూలీలే కారణం అని తెలుస్తోంది. వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న వలస కూలీలు కరోనా భారీన పడుతున్నారు. వీరి వల్ల రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం వలస కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా భారీన పడి 30 మంది మృతి చెందారు. 
 
సీఎం కేసీఆర్ ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 29 లోపు రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త కేసులు నమోదు కాకుండా అధికారులు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వస్తే 1000 రూపాయలు జరిమనా విధిస్తున్నారు. మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1980కు చేరగా 45 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: