తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను సడలించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యాపార, వాణిజ్య సేవలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రానున్నారు. 
 
తెలంగాణ సర్కార్ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది విధులకు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు శాఖల ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తుండగా ఈరోజు నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అన్ని శాఖల ఉద్యోగులు హాజరు కానున్నారు. 
 
రెడ్ జోన్ జిల్లాల్లో మాత్రం వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పని చేయనుండగా ఇతర శాఖల ఉద్యోగులు 33 శాతం హాజరు కానున్నారు. హైదరాబాద్ నగరంలో రొటేషన్ పద్ధతి అమలవుతుందని... నేటి నుంచి ఐటీ కంపెనీలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే రివ్యూ మీటింగ్ లో రెడ్ జోన్ జిల్లాల్లో ఆంక్షల సడలింపుల గురించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు మోదీ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని... లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు పొడిగించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 18 నుంచి కేంద్రం ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వేశాఖ రేపటి నుంచి 15 రైళ్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు నడపనున్నట్టు ప్రకటన చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాలకు రైల్వే శాఖ రైళ్లను నడపనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: