నాలుగు రోజుల క్రితం జరిగిన విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన నిపుణులు ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ కావడానికి మానవ తప్పిదమే కారణమని తేల్చారు. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం యాజమాన్యం నిర్లక్ష్యం, మానవ తప్పిదాల వల్లే గ్యాస్ లీకేజ్ అయినట్టు తేల్చింది. 
 
ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి సాక్ష్యాధారాలను సేకరించింది. ఫోరెన్సిక్ బృందం తమ నివేదికలో స్టైరీన్ ఉష్ణోగ్రతను 20 డిగ్రీల లోపు ఉంచడంలో నిర్లక్ష్యం జరిగిందని... స్టైరీన్ స్టోరేజీ ట్యాంకులో ఆటో పాలిమరైజేషన్ ఇన్ హిబిటర్ ను మిక్స్ చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని వెల్లడించింది. స్టెరీన్ గ్యాస్ ని టెర్షియరీ బ్యుటైల్ కెటిచాల్ అనే కెమికల్ లో కలపాల్సి ఉండగా లాక్ డౌన్ సమయంలో ఈ ప్రక్రియ జరగకపోవడంతో ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. 
 
సెల్ఫ్ పాలిమరైజేషన్ కెమికల్ రియాక్షన్ కు దారి తీయడంతో ఈ ప్రమాదం జరిగిందని తేలింది. కెమికల్ రియాక్ష్హన్ వల్ల ఉషోగ్రత 150 డిగ్రీలకు పెరిగిందని... కంపెనీలో కూలింగ్ ప్రాసెస్ ను కూడా సరిగ్గా నిర్వహించలేదని నివేదికలో వెల్లడైంది. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మానవ తప్పిదమే అని బృందం రిపోర్టు ఇవ్వడంతో కంపెనీ విషయంలో జగన్ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. 
 
సీఎం జగన్ గతంలోనే కంపెనీ తప్పు ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. మరోవైపు ఈరోజు సీఎం జగన్ విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన గురించి సమీక్ష నిర్వహించారు. అధికారులు గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పడంతో ఐదు గ్రామాల ప్రజలను సొంతూళ్లకు తరలించాలని సూచించారు. మంత్రులంతా గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఈరోజు రాత్రికి బస చేయాలని చెప్పారు. రాత్రికి గ్రామాలకు చేరుకున్న వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: