పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి, డ‌బ్బున్న వారు అనే తేడా లేకుండా ఇప్పుడంతా క‌రోనా దెబ్బ‌కు త‌మ త‌మ స్థాయిల్లో దెబ్బ‌తిన్నారు. చిన్నా, చిత‌క వ్యాపారులు అయితే లాక్ డౌన్ అనే సమ‌యంలో మ‌రింతగా ఇబ్బందుల్లో ప‌డిపోయారు. ఇలాంటి త‌రుణంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా దెబ్బకు చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడంలో భాగంగా ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం రుణ హామీ పథకాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

లాక్‌ డౌన్ కార‌ణంగా దేశంలో చాలా ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. గ‌త రెండు నెల‌లుగా ఎటువంటి ప‌నులు జ‌ర‌గ‌లేదు. దీంతో ఎంఎస్ఎంఈలకు కార్మికుల‌ వేత‌నాలు చెల్లించేందుకు క‌ష్టంగా మారింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులకు కనీస వేతనాలను సైతం ఇవ్వలేని దుస్థితికి ఎంఎస్‌ఎంఈలు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో అదనంగా 10-15 శాతం నిర్వహణ మూలధనాన్ని అందించాలని కేంద్రం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బ్యాంకులు వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ ప‌రిమితి ఆధారంగా 10 శాతం అద‌న‌పు రుణాన్ని అందిస్తున్నాయి. ఈ రుణాన్ని పెంచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. 

 

వ్య‌వ‌సాయ రంగం త‌రువాత దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎంఎస్ఎంఈ రంగం ఉంది. ప్ర‌తిపాదిత క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ద్వారా బ్యాంకులు మ‌ద్ద‌తు ఇస్తాయి. ఏదైనా రుణ గ్ర‌హిత డిఫాల్ట్ అయిన‌ప్పుడు రుణ‌దాత‌ల డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది. సంక్షోభంలో కూరుకుపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే యూసుఫ్‌గూడలోని ఎంఎస్‌ఎంఈ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ (నిమ్స్‌మే) చర్యలు తీసుకుంటోంది. సీనియర్‌ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. వారి అభిప్రాయాలను, ఆలోచనలను తెలుసుకుంటున్నారు. వీరి సూచనలకు అనుగుణంగా నివేదికలు తయారు చేసి వీటిని కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. మరోవైపు ఎంఎస్‌ఎంఈ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం http://ideas.msme.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: