కరోనాను అంతం చేయటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ ప్రయోగాలు అనేక దేశాలు చేస్తున్నాయి. కానీ ఈ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోతే ఏంటి పరిస్థితి? వ్యాక్సిన్‌ విఫలమైనా, ఇప్పట్లో రాకపోయినా కరోనాకు లక్షలమంది బలికావలసిందేనా?

 

ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్ గతంలో ఎటాక్ చేశాయి.  అయితే, ప్రతి వైరస్ కి వ్యాక్సిన్ అవసరం లేదు. మందులు సరిపోతాయి. కానీ, పాండమిక్ గా మారి ఖండాలు దాటి ప్రపంచాన్ని కబళించే వైరస్ లకు వ్యాక్సిన్ కావల్సిందే. లేదంటే మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుంది. 

 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 42 లక్షలకు చేరుకున్నాయి. మరణాలు మూడులక్షలకు సమీపంలో ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఇక ఇటలీ, యూకె, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు  పెరుగుతున్న కేసులతో, మరణాలతో గగ్గోలుపెడుతున్నాయి. అగ్రరాజ్యాల ప్రజారోగ్య వ్యవస్థలను కుప్పకూల్చి అంతులేని ఆందోళనలో పడేస్తోంది కరోనా.   

 

కరోనా వ్యాపించకుండా ఉండాలంటే లాక్ డౌన్ పరిష్కారమని భావించారు. అదే లక్ష్యంతో అనేక ఆంక్షలను అనుసరించారు. కానీ, రెండునెలలు దాటేసరికి సీన్ మారింది. ఆర్థిక సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి.  నిరుద్యోగం ఆకాశాన్నంటుతోంది. చివరికి డొక్కలెండి ఆకలి చావులదాకా ప్రపంచం నడుస్తుందా అనే భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆంక్షల సడలింపు అనేక దేశాల్లో మొదలవుతోంది. అంతే కాదు.. కరోనాను ఎదుర్కొంటూనే ప్రపంచం పయనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొద్ది నెలలు లేదా ఓ ఏడాది ఏడాదిన్నర జాగ్రత్తగా ఉంటే, వ్యాక్సిన్ వచ్చేస్తుందని, మందులు కనిపెడతారనే నమ్మకంలో ప్రపంచం ఉంది. 

 

దీనికి తగ్గట్టుగానే అభివృద్ధి చెందిన దేశాలు, ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు ప్రకటనలు కూడా చేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్ ప్రయోగాలు హ్యూమన్ ట్రయల్స్ వరకు వచ్చేశాయి. ఇవి సక్సెస్ అయితే బల్క్‌ లో తయారు చేసి ప్రజలందరికి ఇచ్చేస్తే... కరోనా ఫ్రీ ప్రపంచంగా మారి స్వేచ్ఛగా రెక్కలు విప్పొచ్చనే ఆశ అన్ని దేశాల్లో ఉంది. కానీ ఇక్కడే అనేక సందేహాలు వినిపిస్తున్నాయి. 

 

కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు ప్రయోగాల దశలోనే ఉంది. ఈ ట్రయల్స్ విఫలమైతే పరిస్థితేంటి? వ్యాక్సిన్ ఇప్పట్లో రాకపోతే ఎలా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న తాజా సమస్య. నిజానికి కరోనా కట్టడికి కావాల్సిన వైరస్ కోసం ప్రపంచంలోని వందకు పైగా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి.  ప్రయోగాల కోసం ఆయా దేశాలు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి.  పరిశోధనలు వేగంగా జరుగుతున్నా, వ్యాక్సిన్ వస్తుందా అంటే ఇప్పటికి అనుమానమే.  ఎందుకంటే, ఎన్నో వైరస్ లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లు లేవు.

 

హెచ్ ఐవీ వైరస్ లాగే కరోనాకు కూడా వ్యాక్సిన్ రాకపోతే ప్రపంచం పరిస్థితేంటి? ఇప్పటికైతే హెల్త్ ఎక్స్ పర్ట్స్, ప్రజా ప్రతినిధులు చెప్తున్నట్టు కరోనాతో సహజీవనం చేస్తూ ప్రపంచం కొన్ని ఆంక్షల మధ్య నడవక తప్పదు. కానీ ఈ పరిస్థితికి ముగింపు ఎప్పుడు? ఎంతకాలం మాస్కులు తొడుక్కుని, శానిటైజర్లు పూసుకుంటూ తిరగాలి? ఎన్ని నెలలు, సంవత్సరాలు, ఇలా సహజీవనం చేయాలి? ఇదే ఇప్పుడు సమాధానం తెలియాల్సిన ప్రశ్న.

 

మరింత సమాచారం తెలుసుకోండి: