ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు ఊహించ‌ని బ్యాడ్ న్యూస్‌. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు లీక్‌ ప్రభావం షాక్‌తో ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు షాక్‌లోనే ఉన్నారు. స్టెరిన్ గ్యాస్ లీక్‌తో 11 మంది మృతి చెందిన ఉదంతం తెలిసిన సంగ‌తే. అయితే, ఈ ప్ర‌మాదం కంటే మ‌రిన్ని ఇబ్బందులు ఇంకొంత కాలం కొన‌సాగ‌నున్నాయి. ఎల్జీ పాలిమ‌ర్స్ క‌ష్టాలు మరో ఏడాది పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఎల్జీ పాలిమ‌ర్స్ ప్ర‌మాదం నేప‌థ్యంలో సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. పరిశ్రమ సమీపంలోని రహదారులు, ఇండ్లల్లో స్టైరిన్‌ అవశేషాలను నిపుణుల బృందం గుర్తించింది. ఒక ఇంట్లో ఏకంగా  1.7 పీపీఎం స్టైరిన్‌ను గుర్తించినట్లు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిశ్రమ పరిసరాల్లో పండే కూరగాయలు, పండ్లను సంవత్సరం వరకు తినకుండా చూసుకోవాలని హెచ్చరించారు. 5 గ్రామాల ప్రజలకు 3 కిలోమీటర్ల  పరిధిలోని కూరగాయలు, పండ్లను వినియోగించకుండా చూసుకోవాలని తెలిపారు. ప‌శుగ్రాసాన్ని పశువులకు అందించ వద్దని, స్థానిక పాల ఉత్పత్తులను కూడా వినియోగించవద్దని సిఫారసు చేసింది. తాగేందుకు, వంటల కోసం బహిరంగ జలాలను కూడా వాడొద్దని నిపుణుల బృందం సూచించింది.  ఇక్కడి నివాసాలను పూర్తిగా శుభ్రపరిచిన తర్వాతనే తిరిగి వెళ్లాలని, స్టైరిన్‌ ప్రభావానికి గురైన వ్యక్తులు ఏడాది పాటు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఈ బృందం సూచించింది.

 

ఇదిలాఉండ‌గా, ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ మూతబడే ఉంటుందని, ఎట్టిపరిస్థితుల్లో కంపెనీని ఇక తెరువరని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడుతూ..' ఒక టన్ను స్టైరిన్‌  కూడా రాష్ట్రంలో ఉండొద్దని సీఎం జగన్‌ చెప్పారు. పోర్టుల్లో ఉన్న రెండు ట్యాంక్‌ల స్టైరిన్‌ తరలించేందుకు రెండు షిప్‌లు ఏర్పాటు చేశాం. కంపెనీలో ఉన్న స్టైరిన్‌ కూడా తరలిస్తాం. కంపెనీని కూడా తరలిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఐదు రోజుల్లో స్టైరిన్‌ ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్లిపోతుంది` అని మంత్రి పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: