మొద‌ట్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌లు కాస్త స్నేహ‌పూర్వ‌కంగానే ఉన్న‌ట్లు క‌నిపించారు. న‌దీజ‌లాల వినియోగం విష‌యంలోనూ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుదామ‌ని, తెలుగు రాష్ట్రాల‌ను సుసంప‌న్నం చేసుకుందామ‌ని అప్ప‌ట్లో మాట్లాడుకున్నారు. కానీ.. రానురాను దూరం పెరిగిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. న‌దీజ‌లాల విష‌యంలో ఎవ‌రిదారి వారిదే అన్న‌ట్లు ముందుకు వెళ్తున్నారు. తాజాగా.. ఏపీ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోపంతో ఊగిపోయారు.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.

 

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని పేర్కొన్నారు. దీంతో పాల‌మూరు, న‌ల్ల‌గొండ త‌దిత‌ర జిల్లాలకు తీవ్ర నీటి స‌మ‌స్య ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. దీనిపై రాజీలేని ధోరణి అవలంబిస్తామని, ప్రాజెక్టును అడ్డుకోవడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ విష‌యంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని, కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. తెలంగాణను సంప్రదించకుండానే శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంబిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.పోరాటానికి సిద్ధ‌మ‌వుతామంటూ కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ ఎలా స్పందిస్తారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే.. సీఎం జ‌గ‌న్ కూడా ఇదే స్థాయిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌మాధానం ఇస్తార‌ని, ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఆయ‌న కూడా రాజీప‌డ‌ర‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: