దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో తక్షణ వైద్య సౌకర్యాలు కల్పించటానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఈ ప్రత్యేక రైళ్లను తాత్కాలిక కరోనా చికిత్సా కేంద్రాలుగా మార్చింది. కేంద్రం కరోనా అనుమానిత లేదా స్వల్ప లక్షణాలతో బాధ పడేవారికి అదనపు బెడ్ లు సౌకర్యం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకుంది. 
 
కేంద్రం దేశవ్యాప్తంగా 215 ప్రత్యేక రైళ్లలో కరోనా చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక రైళ్ల బోగీలను కరోనా చికిత్సా కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల స్థానిక అధికారులకు అప్పగిస్తుంది. ఈ చికిత్సా కేంద్రాలలోని కోచ్ లలో క్యాబిన్ కు ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం క్యాబిన్ కు ఇద్దరిని అనుమతిస్తారు. రైల్వే శాఖ వైద్య సిబ్బంది వీరికి వైద్య సేవలను అందిస్తారు. 
 
ఈ రైలును స్థానికంగా ఉండే కరోనా ఆస్పత్రికి అనుసంధానం చేసి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక కరోనా ఆస్పత్రులకు తరలించేందుకు ఆక్సిజన్ సౌకర్యం గల ఆంబులెన్స్ ను ఏర్పాటు చేస్తారు. స్థానిక జిల్లా వైద్య అధికారిచే గుర్తించబడిన వైద్య సిబ్బంది ఈ ప్రత్యేక రైళ్లలో పని చేస్తారు. రైల్వే శాఖ రైళ్లలో ఉన్నవారికి భోజన, వసతి ఏర్పాట్లు చేయడంతో పాటు చికిత్స అందించే వైద్యులకు రక్షణ బాధ్యతలను నిర్వహిస్తుంది. 
 
బోగీలలో తగిన చర్యలు తీసుకుని ఉష్ణోగ్రతలు పెరగకుండా జాగ్రత్త పడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాస, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్, కొండాపురం(కడప), దిగువ మెట్ట స్టేషన్లలోని ప్రత్యేక రైళ్లలో కరోనా చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో ఈ రైళ్ల ద్వారా కరోనా అనుమానితులకు, స్వల్ప లక్షణాలు ఉన్నవారికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత అధికారులు ప్రత్యేక రైళ్లను శానిటైజ్ చేసి రైల్వే శాఖకు అప్పగిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: