దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ వల్ల ఐటీ రంగం మినహా మిగతా అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. అయితే భవిష్యత్తులో కూడా ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. 
 
మెగా సిస్టమ్స్ ఇండియా ఎండీ సుధీర్ రెడ్డి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని పలు రంగాల నుంచి ప్రాజెక్టులు గతంలో మాదిరిగా రాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఐటీ రంగం పెను మార్పులకు లోనవుతుందని చెప్పారు. గతానికి భిన్నమైన పద్ధతుల్లో కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే కరోనా ప్రభావం ఐటీ రంగంపై తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. 
 
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని... ఐటీ రంగానికి కొన్ని సవాళ్లు కనిపిస్తున్న మాట వాస్తవమని పేర్కొన్నారు. లాక్ డౌన్ లో సిబ్బంది ఉత్పాదికత పెరిగిందని... సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రాజెక్టులను పూర్తి చేశారని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోం విధానంలో మంచి ఫలితాలు సాధించడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. 
 
కొన్ని రంగాలు కోలుకోవడానికి సమయం పడుతుందని... ఇప్పటికిప్పుడు కొత్త ప్రాజెక్టులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రం పరిస్థితి మారుతుందని పేర్కొన్నారు. సైబర్ భద్రత, ఐటీ భద్రత లాంటి సమస్యలను పరిష్కరించగలిగితే భవిష్యత్తులో కార్యకలాపాల తీరు సమూలంగా మారుతుందని అన్నారు. రిటైల్, హాస్పిటాలిటీ, ఏవియేషన్ ప్రాజెక్టులు నిర్వహించే సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: