ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. కరోనా భారీన పడిన వారిలో వృద్ధులు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతూ ఉండటంతో వృద్ధుల్లో చాలా తక్కువ మంది మాత్రమే కరోనాపై విజయం సాధిస్తున్నారు. 
 
అయితే కరోనా భారీన పడిన వారిలో ఒక వృద్ధ మహిళ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 102 ఏళ్ల క్రితం లుబికా లుబీ గ్రెన్‌కో అనే చిన్నారి ఫ్లూ భారీన పడింది. సాధారణంగా చిన్నపిల్లలు ఫ్లూ జయించటం చాలా కష్టం. కానీ ఆ చిన్నారి ఫ్లూతో పోరాడి గెలిచింది. ప్రస్తుతం లుబికా లుబీ గ్రెన్‌కో వయస్సు 105 ఏళ్లు కాగా లుబికా ఆగష్టులో 106వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. 
 
ప్రస్తుతం న్యూ మెక్సికో, గల్లుప్‌లోని ‘లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్’ అనే ఆశ్రమంలో నివశిస్తోన్న లుబికాకు ఏప్రిల్ 29వ తేదీన కరోనా నిర్ధారణ అయింది. మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ సమయంలో జన్మించిన లుబికా మూడేళ్ల వయస్సులో ఫ్లూ భారీన పడి జయించింది. ఫ్లూ భారీన పడి లుబికా తల్లి మరిజెటా కౌజ్లారిక్, లుబికా చెల్లెలు మృతి చెందారు. అయితే లుబికా మాత్రం ఫ్లూపై గెలిచింది. 
 
లుబికా మనవరాలు మిస్టీ టోల్సన్ ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. 105 ఏళ్ల వయస్సులో కరోనా భారీన పడిన లుబికా కరోనాపై విజయం సాధించాలని ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 105 ఏళ్ల వయస్సులో కరోనాతో పోరాడుతున్న లుబికా ఫోటో వైరల్ అవుతోంది. లుబికా కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: