తెలంగాణ విద్యా శాఖ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జూన్ రెండవ వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో ఈరోజు జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. గన్ ఫౌండ్రీలోని మహబూబియా కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. తొలుత రెండో సంవత్సరం, ఆ తర్వాత మొదటి సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగనుంది. 
 
ప్రభుత్వం కరోనా విజృంభిస్తూ ఉండటంతో మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 33కు పెంచింది. ప్రతిరోజూ 15,000 మంది లెక్చరర్లు 30 రోజుల పాటు మూల్యాంకనం చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఒక్కో అధ్యాపకుడికి 45 పేపర్లు అందించి ఒక్కో పేపర్ పది నిమిషాల వ్యవధిలో దిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎంసెట్ ఫలితాల కన్నా ముందే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. 
 
కరోనా నివారణా జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రవాణా, వసతి సదుపాయాలను కల్పించారు. లెక్చరర్లు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారులు ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్, పాసులు అందజేశారని తెలుస్తోంది. అధికారులు మూల్యాంకన కేంద్రాల్లో రోజూ ఫాగింగ్, శానిటైజేషన్ చేపట్టనున్నారు. 
 
ఒకేషనల్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఒకేషనల్ విద్యార్థుల జవాబు పత్రాలకు ఇంకా కోడింగ్ పూర్తి కాలేదని తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ ఈ నెల చివరి వారం నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ప్రభుత్వం హైకోర్టు అనుమతుల కొరకు ఎదురు చూస్తోంది. మరోవైపు ఏపీలో మాత్రం జులై నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది.                         

మరింత సమాచారం తెలుసుకోండి: