ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ నిలిపివేసిన జగన్ సర్కార్ తాజాగా పిల్లల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చే వీలు కల్పించింది. కొత్తగా వివాహమైన భార్యాభర్తలు కొత్త కార్డులు పొందేందుకు అవకాశం కల్పించింది. ఎవరైనా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే చేసుకొనే సదుపాయం కల్పించింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రేషన్ కార్డు స్థానంలో బియ్యం కార్డు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బియ్యం కార్డుల పంపిణీ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అనర్హులకు బియ్యం కార్డులు మంజూరయ్యాయని ఆరోపణలు రావడంతో అధికారులు మరోసారి కార్డులను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం పాత రేషన్ కార్డులపైనే బియ్యం పంపిణీ జరుపుతోంది. మరోవైపు అర్హత కలిగిన వారిని బియ్యం కార్డులో చేర్చేందుకు, తొలగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 
 
కుటుంబ సభ్యులలో ఎవరి పేరైనా కార్డులో లేకపోతే వారు ఆధార్ కార్డును రెవిన్యూ అధికారులకు అందజేసి రేషన్ కార్డులో చేర్చవచ్చు. కొత్తగా రేషన్‌కార్డు కావాలనుకొనే వారంతా తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. . కొత్త దంపతులు, వారి పిల్లలు రేషన్‌కార్డుతో పాటు ప్రజా సాధికార సర్వేలోనూ పాత కుటుంబం నుంచి విడిపోయి కొత్తగా మరో కుటుంబం కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
మరోవైపు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ అందించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు బియ్యం, కంది బేడలు అందించింది. కేంద్రం లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడిగించడంతో ప్రభుత్వం మరోసారి ఉచితంగా బియ్యం, కంది బేడలు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: