శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను తరలించేందుకు కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని  తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది .  కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం పై   కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది . ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ బోర్డు చైర్మన్ కు లేఖ రాశారు . రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మించాలని చూస్తోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు .

 

అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా నూతన ప్రాజెక్టు చేపట్టడానికి వీల్లేదని బోర్డు చైర్మన్ దృష్టికి రజత్ కుమార్ తీసుకువెళ్లారు . పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్  సామర్ధ్యాన్ని పెంచకుండా చూడాలన్న రజత్ కుమార్ , సామర్ధ్యాన్ని పెంచుతూ ఆహ్వానించే టెండర్లను అడ్డుకోవాలని కోరారు . అయితే  తెలంగాణ ప్రభుత్వం వాదనలను ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు , అధికార పార్టీ నాయకులు తోసిపుచ్చుతున్నారు . రాష్ట్ర పునర్ విభజన చట్టానికి తెలంగాణ ప్రభుత్వం కూడా తూట్లు పొడిచిందని వారు మండిపడుతున్నారు . పాలమూరు , రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎలా చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు  . వరద జలాలను తరలించేందుకు నూతన ఎత్తిపోతల పథకం తాము  చేపడితే తెలంగాణ కు వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నిస్తున్నారు .

 

తమ రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు .  రాయలసీమ తో సహా నెల్లూరు , ప్రకాశం జిల్లాలకు తాగునీటికి ఇబ్బందులున్నాయని ఆయన చెప్పారు . వరదనీరు ఎక్కువగా ఉండే పదిరోజుల్లోనే ఆ జలాలను తోడుకునేందుకు అవకాశం ఉంటుందని  అందుకే నూతన ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడిందించారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: