తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొన్న 79 కరోనా కేసులు నమోదు కాగా నిన్న 51 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1326కు చేరింది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం తగ్గుముఖం పట్టిన కరోనా మరలా విజృంభించడం గమనార్హం. 
 
నిన్న నమోదైన కేసులలో 37 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 14 మంది వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తగ్గుముఖం పట్టకపోవడం, వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అవుతూ ఉండటంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఇద్దరు కరోనా భారీన పడి మృతి చెందడంతో మృతుల సంఖ్య 32కు చేరింది. 
 
నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 822 మంది డిశ్చార్జ్ కాగా 472 యాక్టివ్ కేసులు నమోదైనట్టు సమాచారం. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో నిన్న 33 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ 33 కేసులలో 20 కేసులు తమిళనాడు నుండి ఏపీకి వచ్చిన వారికి నిర్ధారణ కావడం గమనార్హం. నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2051కు చేరింది. రాష్ట్రంలో 46 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: