విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని టీడీపీ రాజకీయం చేయాలనుకుంటే... చంద్రబాబు హయాంలోనే ఎల్జీ పాలిమర్స్ కు అన్ని రకాల అనుమతులు ఇచ్చారంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. అయితే దీనికి టీడీపీ కూడా కౌంటర్లిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి ఆరు దశాబ్దాల క్రితం నుంచి ఏఏ ప్రభుత్వాలు ఈ కంపెనీకి భూములు ఇచ్చాయో, అనుమతులు ఇచ్చారో తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని చంద్రబాబు అంటున్నారు. ఒక విధంగా చూస్తే జగన్ సర్కారును బెదిరిస్తున్నారు. 


వైకాపా అధికారంలోకి వచ్చాకే పాలి స్టైరీన్ కు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ విస్తరణకు అనుమతి ఇవ్వడం, కేంద్రానికి సిఫారసు చేసిందనేది నిరూపించేందుకు తమవద్ద అన్ని రుజువులు ఉన్నాయని చంద్రబాబు సవాల్‌ విసిరారు. మరి దీనికి వైకాపా ఏంచెబుతుందో చూడాలి.   పార్టీ సర్వసభ్య సమావేశాన్ని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన చంద్రబాబు జగన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తెదేపానే అనుమతి ఇచ్చిందని వైకాపా చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని చంద్రబాబు సవాల్‌విసిరారు.


జనం చస్తే చచ్చారు, బతికే బతుకుతారు, కరోనాతో చనిపోయినా మూడు శాతమే కదా అంటూ తేలిక భావంతో వైకాపా నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంతజరుగుతున్నా ఈనెల 28 నుంచి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు.  కోర్టులో ఒకటి చెబుతూ బయటకు ఇంకోటి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయవద్దని కోర్టు స్పష్టంచేసినా మూర్ఖంగా మళ్లీ అవే వేస్తున్నారని మండిపడ్డారు. 


ఎల్జీ పాలిమర్స్ అంశంపై స్పందిస్తూ...  దక్షిణ కొరియాలో ఇదేవిధమైన దుర్ఘటనల్లో ఎంత పరిహారం ఇచ్చారో అంత మొత్తం ఇక్కడకూడా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు. ఈ దుర్ఘటనకు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి నైతిక బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. విశాఖ దుర్ఘటన మానవ తప్పిదమేన్న చంద్రబాబు... ఎల్జీ పాలిమర్స్ ను తక్షణమే అక్కడనుంచి తరలించి ఆ భూములలో పార్క్ అభివృద్ది చేయాలన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పై ఉందని అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: