ఏపీలోని కర్నూలు జిల్లాను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టినా కర్నూలు జిల్లాలో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జిల్లాలో కర్నూలు, నంద్యాల ప్రాంతాలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య పెరుగుతున్నా కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. జిల్లాలో 301 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలోనే యాక్టివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. నిన్న 9 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కేసుల సంఖ్య 584కు చేరింది. కేసుల సంఖ్య 600కు చేరువలో ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న 82 ఏళ్ల బామ్మ, మూడేళ్ల చిన్నారి కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 7 నమోదు కాగా నంద్యాలలో 2 కేసులు నమోదయ్యాయి. 
 
కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో కేసుల ఉధృతి తగ్గినా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి వైరస్ వ్యాపించకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు జిల్లాలో కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా సేకరణ ప్రారంభమైంది. జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న 43 మంది ప్లాస్మా ఇవ్వడానికి ముందుకొచ్చారు. 
 
జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పకడ్బందీ చర్యలతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని అన్నారు. లాక్ డౌన్ ను మరెంతో కాలం పొడిగించే పరిస్థితి లేదని వ్యాఖ్యలు చేశారు. కేసులు అత్యధికంగా నమోదైన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని... భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: