ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా రాష్ట్రాన్ని కరోనా భయం మాత్రం వీడటం లేదు. కేసుల సంఖ్య తగ్గిందనే లోపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీని చెన్నై కోయంబేడు మార్కెట్ మూలాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో నాలుగు జిల్లాలపై కోయంబేడు మార్కెట్ ప్రభావం కనిపిస్తోంది. 
 
నిన్న నమోదైన కేసుల్లో 20 కేసులు కోయంబేడుతో లింక్ ఉన్న కేసులు కావడం గమనార్హం. అధికారులు 20 మందికి చెన్నై కోయంబేడు మార్కెట్ కు వెళ్లడం వల్లే కరోనా సోకిందని చెప్పారు. నిన్న చిత్తూరు జిల్లాలో 10 కేసులు, నెల్లూరు జిల్లాలో 9 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ 20 కేసులకు చెన్నై కోయంబేడు మార్కెట్ తో లింక్ ఉండటం గమనార్హం. ఈ మూడు జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాపై కూడా కోయంబేడు మార్కెట్ ప్రభావం పడిందని తెలుస్తోంది. 
 
కూరగాయల లోడుతో వెళ్లిన డ్రైవర్లు, ఇతరులు కరోనా భారీన పడినట్టు తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించి... వైరస్ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి.... మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబసభ్యులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు జరుపుతున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తరుణంలో కోయంబేడు మార్కెట్ లింకులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వలస కార్మికుల్లో 38 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్న నమోదైన కేసులతో కరోనా కేసుల సంఖ్య 2051కు చేరింది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 584 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: