మ‌రోసారి కాలాపాని చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. భార‌త్‌, నేపాల్ దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు ప్రాంతంగా ఉన్న కాలాపానిపై మ‌రోసారి వివాదం రేగుతోంది. కాలాపాని త‌మ‌దేన‌ని నేపాల్ కొత్త‌రాగం ఎత్తుకుంది. భార‌త్‌, నేపాల్‌, చైనాల మ‌ధ్య ట్రై జంక్ష‌న్‌గా ఉన్న ఈ ప్రాంతం అత్యంత కీల‌కం. జ‌మ్ముక‌శ్మీర్‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం జ‌మ్ము, క‌శ్మీర్ ల‌డ‌ఖ్‌ను కేంద్ర‌పాలిత ప్రాంతాలు మార్చిన విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే 2019 న‌వంబ‌ర్‌లో భార‌త ప్ర‌భుత్వం దేశానికి సంబంధించిన‌ కొత్త మ్యాపును విడుద‌ల చేసింది. అయితే.. ఇందులో కాలాపాని ప్రాంతం భార‌త భూభాగంలోనే ఉన్న‌ట్లు చూపించింది. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని పితోరాఘ‌ర్ జిల్లాలో ఉన్న‌ట్లు మ్యాపులో చూపించింది.

 

అయితే.. దీనిపై వెంట‌నే నేపాల్‌స్పందించింది. వివాదాస్ప‌దంగా ఉన్న 35 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌ కాలాపాని ప్రాంతాన్ని భార‌త భూభాగంలో చూపించ‌డం స‌రికాద‌ని, రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డమేన‌ని నేపాల్ పేర్కొంది. నిజానికి.. కైలాస‌ మాన‌స ‌స‌రోవ‌రం యాత్రి ఈ ప్రాంతం గుండానే వెళ్తారు. చైనాతో యుద్ధం త‌ర్వాత కాలాపాని ప్రాంతం ఇండో-టిబెటిన్ సైనికుల నియంత్ర‌ణ‌లో ఉంటోంది. అయితే.. చైనాతో యుద్ధం త‌ర్వాత భార‌త్‌కు వ్యూహాత్మ‌క సైనిక స్థావరంగా వినియోగించుకోవ‌డానికి కాలాపాని ప్రాంతాన్ని ఇచ్చామ‌ని నేపాల్ అంటోంది. 1816లో ఈస్ట్ ఇండియా కంపెనీ నేపాల్ భార‌త్ స‌రిహద్దుగా కాళీ న‌దిగా చూపించిందని, అందుకే కాలాపాని నేపాల్‌లో భాగ‌మ‌ని వాదిస్తోంది. భార‌త్ సుగౌలి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంద‌ని ఆరోపిస్తోంది.

 

నిజానికి..చైనాతో యుద్ధానంత‌రం కాలాపాని భార‌త్‌లో భాగ‌మ‌ని భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కానీ.. ఆనాడు కూడా నేపాల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు. ఎందుకంటే.. చైనా ఆక్ర‌మ‌ణ‌కు దిగిన‌ప్పుడు నేపాల్‌కు భార‌త్ అండ‌గా నిలిచింది. చైనాను అడ్డుకుంది. తాజాగా.. నేపాల్ అభ్యంత‌రం చెప్ప‌డంలో ఆంత‌ర్యం ఏమిటంటే.. కొంత‌కాలంగా చైనాతో నేపాల్ దోస్తీ చేస్తోంద‌ని, అందువ‌ల్లే దీనిని వివాదాస్ప‌దం చేస్తోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. నిరంత‌రం భార‌త్‌ను టెన్ష‌న్ పెట్ట‌డం వ‌ల్ల చైనా నుంచి ప‌రిశ్ర‌మ‌లు భార‌త్‌కు వెళ్ల‌వ‌ని, అందువ‌ల్లే వ్యూహాత్మ‌కంగా నిరంత‌రం వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక నేపాల్ ర‌హ‌దారులు త‌దిత‌ర విభాగాల అభివృద్ధికి చైనా నిధులు ఇవ్వ‌డం వ‌ల్లే నేపాల్ చైనా చెప్పుచేతుల్లో ఉంటుంద‌ని చెబుతున్నారు. ముందుముందు ఈ వివాదం ఎక్క‌డిదాకా వెళ్తుందో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: