కృష్ణా జ‌లాల విష‌యంలో తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం న‌డుస్తోంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రాజెక్టు జీవో 203ను ఏపీ స‌ర్కార్ జారీ చేయ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. క‌నీసం త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా ఎలా జీవో జారీ చేస్తార‌ని, తెలంగాణకు అన్యాయం చేసేలా ఎలా ప్రాజెక్టు క‌డుతార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా స్పందించారు. ఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికి ప్రాజెక్టు కట్టుకుంటున్నామ‌ని, దీన్ని రాజ‌కీయం చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని వ్యాఖ్యానించారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి దాపురించింద‌న్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల‌న్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం కూడా లేద‌ని తేల్చి చెప్పారు. ఏపీ హక్కుగా మనకు కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకుంటున్నామ‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.

 

అయితే.. ఈ స‌మ‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌లు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్ర‌తిప‌క్ష నేత‌లు బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు ఇరుక్కుపోయారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేత‌లు మాత్రం సీఎం కేసీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ‌కు అన్యాయం చేసేలా ఏపీ ప్రాజెక్టు క‌డుతుంటే ఏం చేస్తున్నార‌ని ఈరోజు బీజేపీ, కాంగ్రెస్‌నేత‌లు వేర్వేరుగా ఏకంగా నిర‌స‌న‌లు కూడా తెలుపుతున్నారు. మ‌రోవైపు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌లు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు క‌ట్టితీరాల్సిందేన‌ని అంటున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డొద్ద‌ని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ టీఆర్ఎస్ నేత‌లు మాత్రం తెలంగాణ బీజేపీ నేత‌లకు సూటి ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. ఏపీ, తెలంగాన బీజేపీ నేత‌లు ముందుగా ఒక అవ‌గాహ‌న వ‌చ్చి మాట్లాడాల‌ని, మీకు ద‌మ్ముంటే.. ఏపీ బీజేపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించాల‌ని అంటున్నారు. దీంతో స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్ష నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: