తాజాగా ఓ గుండె తరుక్కుపోయే సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొని అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది. ఇరవై రోజుల క్రితం ఒక వలస కార్మికురాలు తన భర్తతో కలిసి ముంబై మహా నగరం నుండి తన ఇంటికి బయలుదేరింది. అయితే ఈరోజు మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ప్రముఖ వార్త సంస్థ ప్రకారం... మహారాష్ట్రలోని నాసిక్ నగరం నుండి మధ్యప్రదేశ్ లోని సాత్నా గ్రామం లోని తన ఇంటికి వెళ్లేందుకు ఓ దంపతులు బయలుదేరారు. తమ ఇల్లు చేరుకోవాలంటే వెయ్యి కిలోమీటర్ల పైచిలుకు నడవాలి. ఇప్పటికే దాదాపు 850 కిలోమీటర్లు నడిచారు ఆ దంపతులు.


అయితే ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రాగా... ఓ చెట్టుకింద ప్రసవించింది. ఓ బిడ్డకు జన్మనిచ్చి రెండు గంటల కాకుండానే ఆ తల్లి తన భర్తతో కలిసి మళ్లీ రోడ్డు ఎక్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఇంటికి బయల్దేరింది. బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి కేవలం రెండు గంటల్లోనే నడక ప్రారంభించిందన్న విషయాన్ని స్థానికులు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారికోసం ఒక ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. స్వస్థలం చేరుకున్న అనంతరం ఓ ప్రభుత్వ వైద్యుడు తల్లి బిడ్డకు చెక్ అప్ చేసి ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపాడు. ఇంత ఎర్రటి ఎండలో ఓ నవ శిశివుని ఎత్తుకొని ఒక నూతన తల్లి రోడ్డు మీద నడవడం అనేది తల్లిబిడ్డలకు అత్యంత ప్రమాదకరం.


మంగళవారం రోజు ఇటువంటి సంఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్ లోని లలిత్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. తన ఇంటికి వెళ్లేందుకు 500 కిలోమీటర్లు నడిచిన ఓ గర్భవతి రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఎంతో మంది తల్లీబిడ్డలు తిండి లేకుండా వందల వేల కిలోమీటర్లు నడిచి రోడ్ల మీదనే చనిపోతున్నా ప్రభుత్వ యంత్రాంగాలు మాత్రం వారిని ఇంటికి చేర్చేందుకు బస్సులు నడపకపోవడం బాధాకరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: