పేరుకే అగ్రరాజ్యం భూతల స్వర్గం. అక్కడ అరాచకాలు కూడా అలానే ఉంటాయి. చిర్రెత్తుకొచ్చిందా సింపుల్‌ గా లేపేస్తారు. కరోనా కాలంలో ఉద్యోగాలు పోయి కోట్ల మంది రోడ్డున పడుతున్నారు. తిండికోసం గంటలతరబడి క్యూలో నిలబడుతున్నారు. పరిస్థితి  చేయిదాటితే, అరాచకం నిద్రలేచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి చోట...అభద్రత ముదిరితే అరాచకం తప్పదనే భయాందోళనలు పెరుగుతున్నాయి. 

 

పేరుకి అగ్రరాజ్యమే కానీ.. కరోనా మాత్రం అమెరికాని ఓ ఆట ఆడుకుంటోంది. నిన్నటిదాకా ఏదో ఒక విధంగా ప్రపంచాన్ని బుకాయించి తన మాట నెగ్గించుకున్న అమెరికా కరోనా ముందు నానా తిప్పలు పడుతోంది. కరోనా కారణంగా కుప్పకూలుతున్న ఆరోగ్య వ్యవస్థలు. లాక్ డౌన్ తో అగ్రరాజ్యంలోని ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు తినడానికి తిండిలేక పస్తులుంటున్నారనే నివేదికలు రావటం అమెరికా ప్రస్తుత పరిస్థితిని చెప్తోంది. 

 

ప్రపంచ స్థాయి పరిశ్రమలు... విదేశాలపై కుమ్మరించే ఉత్పత్తి సామర్థ్యం ఉన్న వ్యవసాయం.. పదుల సంఖ్యలో వెలుగు జిలుగుల నగరాలు..ఆయుధాల ఉత్పత్తి, ఫార్మా కంపెనీలు...,  చీకూ చింతా లేకుండా బతికేసే కోట్లాది అమెరికన్లు.. కానీ, ఇదంతా పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నంత వరకే. కరోనాతో అమెరికాలో చివరికి అరాచకం పెరుగుతుందా అనే ఆందోళన పెరుగుతోంది. 

 

కరోనా వచ్చిందో  లేదో రెండు నెలల క్రితమే మాల్స్ లో తన్నుకున్నారు. ఒకళ్లనొకళ్లు తొక్కేసుకుని షాపుల్లో స్టాకంతా ఊడ్చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ టైమ్ లో ఎవరిళ్లల్లో వాళ్లుంటున్నా.., రేపటి సంగతి ప్రశ్నార్థకమే. నెలా రెండు నెలల క్రితమే తుపాకులు అమ్మే షాపుల దగ్గరా జనాలు పోటెత్తారు. అంటే పాలకోసం, పిండికోసం, టాయిలెట్ పేపర్ కోసం ఎవరు దోపిడీకి వస్తారో అనే అనుమానాలతో వాళ్లు ముందస్తు చర్యలకు పూనుకున్నారు. నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఉపాధి లేక అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారిలో ఎవరిని కదిలించినా ఆందోళన, భయం, కనిపిస్తున్నాయి. అధికారికంగా 2 కోట్ల మందిపైగా ఉద్యోగాలు కోల్పోయారని అధికారికంగా చెబుతున్నా ఆ సంఖ్య 5 కోట్ల వరకూ ఉంటుందని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ఇండిస్టియల్ ఆర్గనైజేషన్స్ అంచనా వేస్తోంది. 

 

ఇక చిన్న వ్యాపారాలపై ఆధారపడ్డవారు కూడా రోడ్డునపడ్డారు. చేతిలో వెయ్యిడాలర్లు కూడా లేనివారు కోట్లలో ఉన్నారు.  చిన్న వ్యాపారులకు అప్పులివ్వటానికి కేటాయించిన 349 బిలియన్ డాలర్ల నిధి రెండు వారాల్లోనే ఖాళీ అయిపోయింది. వారందరూ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆదుకొమ్మంటూ అర్థిస్తున్నారు. కుటుంబాలతో సహా ఫుడ్ బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ కార్లు బారులు తీరి ఉంటున్నాయి. 

 

టెక్సాస్, ఇండియానాలతో పాటు, అనేక రాష్ట్రాల గవర్నర్ ల ఇళ్లముందు నిరసనలు జరుగుతున్నాయి. కానీ ముందునుయ్యి వెనుక గొయ్యిలాగా లాక్‌ డౌన్ ఎత్తేస్తే కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతుందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పటికే ఉన్న పాజిటివ్ కేసులను ఎదుర్కొనే స్థాయిలో అమెరికా వైద్య వ్యవస్థ లేదు. ఇంకా కేసులు పెరిగితే చేతులెత్తేయటం మినహా మార్గం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: