క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యానికి తూట్లు ప‌డుతున్నాయి. ‌ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కాకుండా ప్రైవేటు ల్యాబ్స్​లో టెస్టులకు పర్మిషన్ ఇస్తే జనాలను దోచుకుంటాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఐసీఎంఆర్ అనుమతి ఉన్నా టెస్టులు చేయొద్దని ఆయా సంస్థలను ఆదేశించింది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే, జనాల్లో ఉన్న కరోనా భయాన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా, దొంగ చాటుగా కరోనా టెస్టులు చేస్తున్నాయి.

 


రాష్ట్రంలోని 10 ప్రభుత్వ, 11 ప్రైవేట్​ ల్యాబ్స్​లో కరోనా టెస్టులు చేయడానికి ఐసీఎంఆర్ అనుమ‌తి ఇచ్చింది. తెలంగాణ‌ రాష్ట్రం నుంచి ఇలా అనుమ‌తి పొందిన ప్రైవేటు ల్యాబ్స్​లో సికింద్రాబాద్‌‌లోని అపోలో హాస్పిటల్స్‌‌ ల్యాబ్, యశోద హాస్పిటల్స్‌‌ ల్యాబ్, మెడిక్స్‌‌ పాథ్‌‌ల్యాబ్స్‌‌, చర్లపల్లిలోని వింట ల్యాబ్స్‌‌, హిమాయత్‌‌నగర్‌‌‌‌లోని విజయ డయాగ్నొస్టిక్స్‌‌, పంజాగుట్టలోని డాక్టర్ రెమిడీస్, మేడ్చల్‌‌లోని పాథ్‌‌కేర్ ల్యాబ్‌‌, బయాగ్నొసిస్‌‌ టెక్నాలజీస్‌‌, శేరిలింగంపల్లిలోని సిటిజెన్స్ హాస్పిటల్‌‌, జూబ్లిహిల్స్‌‌లోని అపోలో లాబోరేటరీస్, బంజారాహిల్స్‌‌లోని టెనెట్ డయాగ్నస్టిక్స్ ఉన్నాయి. అయితే, ఇవి కాకుండా ప‌లు సంస్థ‌లు దొంగ‌చాటుగా టెస్టులు చేసిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా, దొంగ చాటుగా కరోనా టెస్టులు చేస్తున్న స‌ద‌రు ల్యాబ్‌లు ఒక్కో టెస్టుకు కేంద్రం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఈ విషయం ఐసీఎంఆర్ ద్వారా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులకు తెలిసిందని స‌మాచారం.

 

ఐసీఎంఆర్ నుంచి అనుమ‌తి పొందిన సంస్థలు కొనుగోలు చేసే టెస్ట్‌‌ కిట్ల దగ్గరి నుండి, చేస్తున్న టెస్టుల వరకూ ఐసీఎంఆర్‌‌‌‌కు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ల్యాబ్‌‌కు యూజర్ ఐడీ, పాస్‌‌వర్డ్‌‌ను ఐసీఎంఆర్ కేటాయించింది. ఆయా ల్యాబ్స్​లో జరుగుతున్న టెస్టుల వివరాలు చూసే వెసులుబాటు ఐసీఎంఆర్‌‌‌‌కే ఉండగా, ఇటీవల రాష్ట్రాల ఆరోగ్యశాఖలకూ కల్పించారు. కాగా, అనుమ‌తి పొంద‌ని ఓ ‌ ల్యాబ్‌‌లో 3 వేల మందికి టెస్టులు చేయగా, కొంత మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. గుట్టుగా టెస్టులు చేయడంపై సదరు సంస్థను ఆరోగ్య శాఖ వివరణ కోరినట్టు తెలిసింది. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న శాంపిల్స్‌‌ను పరీక్షించామని, ఇక్కడెవరికీ టెస్టులు చేయలేదని సదరు సంస్థలు వివరణ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ ల్యాబ్స్​లో టెస్ట్ చేయించుకున్న వాళ్లలో పాజిటివ్ వచ్చిన వారు ఎవరు? ఎక్కడి వాళ్లు? వాళ్లకు ఎక్కడ టెస్ట్​ చేశారు? అనే వివరాలను అధికారులు చెప్పలేదు. కాగా, ఇలా ప‌రీక్ష‌లు చేసుకుంటే అధికారుల‌కు స‌మాచారం అంద‌ని ప‌క్షంలో స‌ద‌రు రోగుల ద్వారా క‌రోనా విస్తృతి సంభ‌వించ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: